నక్సలిజం, దేవాదాయ శాఖ భూముల వ్యవహారం… ఈ రెండింటి గురించి కొన్నేళ్ల క్రితం ఎక్కడో చదివినట్లు అనిపిస్తుంటుంది. ఇది ఇప్పుడు కాదు కొరటాల శివ ‘ఆచార్య’ ప్లాట్ గురించి చెప్పినప్పటి నుండి అలానే అనిపిస్తోంది. ఈ రెండింటి కాంబినేషన్ నార్మల్‌గా ఉండదు అని ‘ఆచార్య’ ప్రచార చిత్రాలు చూస్తే తెలిసిపోతుంది. అయితే ఈ సినిమా గురించి తాజాగా బయటికొచ్చిన ఓ రూమర్… ఆసక్తికరంగా మారింది. వాటి ప్రకారం చూస్తే ఈ సినిమా ఓ పుస్తకాన్ని స్ఫూర్తిగానే తీసుకొని, ఆధారంగా తీసుకునో రాసినట్లు సమాచారం.
‘ఆచార్య’ కథ నేటిది కాదని ఆ పోస్టర్లు, ప్లాట్ గురించి వింటే తెలిసిపోతుంది. ఎందుకంటే దేవాదాయ శాఖలో అక్రమాలు, నక్సలిజం నాటి అంశాల కాంబోలో తీసుకొస్తున్నారు. ఈ సినిమా 1970ల కాలంలో జరిగినట్లుగా ఉంటుందని తెలుస్తోంది. ఆ రోజుల్లో శ్రీకాకుళం జిల్లాలోని బొడ్డపాడు ప్రాంతంలో జరిగిన పరిణామాల ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నారని సమాచారం. ఒడిశాకు చెందిన సుబ్బారావు అనే వ్యక్తి బొడ్డపాడు గ్రామంలో శివాలయంలో పూజారిగా ఉండేవారట. ఆ సమయంలో భూస్వాములకు వ్యతిరేకంగా ఆయన ఉద్యమం చేశారట.
అతని జీవితం ఆధారంగా ‘సుబ్బారావు పాణిగ్రాహి’ అనే పుస్తకం ఆ రోజుల్లో రాశారట. ఇప్పుడు ఆ ‘సుబ్బారావు పాణిగ్రాహి’ పుస్తకం ఆధారంగానే ‘ఆచార్య’ సినిమాను తెరకెక్కించారట. సుబ్బారావు తరువాత ఆ ఉద్యమాన్ని అతని సోదరుడు హేమచంద్ర పాణిగ్రాహి చేపట్టారట. ఆ సమయంలో ఆ ప్రాంతానికి చెందిన ఇద్దరు పేరున్న నక్సలైట్లు సుబ్బారావు చేస్తున్న ఉద్యమానికి సాయం చేశారట. ఆ ఇద్దరూ ఉపాధ్యాయులుగా పని చేసి అక్కడ ప్రజలను చైతన్యవంతులను చేసేవారట. ఇప్పుడు కొరటాల శివ ఆ అంశాలను తీసుకొని.. కథ సిద్ధం చేసుకున్నారట.
సినిమాకు ‘ఆచార్య’ అనే పేరు పెట్టడం వెనుక కూడా ఇదే కారణం అని అంటున్నారు. అయితే పాఠాలు చెప్పను కానీ నన్ను ఆచార్య అని అంటారు అంటూ చిరంజీవి టీజర్ డైలాగ్ చెప్పారు. మరి దాని వెనుక కథేంటో సినిమా చూస్తే తెలుస్తుంది. సినిమాను ఫిబ్రవరి 4న విడుదల చేస్తారని ప్రకటించారు. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆ సమయానికి సినిమా వస్తుందా? అనేది చూడాలి.