ఓ మీటింగ్ పెట్టి.. అక్కడొచ్చినవాళ్లకు నాలుగు మంచి మాటలు చెబితే ఓకే. అలా కాకుండా పక్కవాళ్ల మీద విద్వేషం నింపాలని చూస్తే ఆ తర్వాత చాలా ఇబ్బందులు వస్తాయి. ఏకంగా ఎవరికీ కనిపించకుండా దాక్కోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఇప్పుడు సీనియర్ నటి కస్తూరి (Kasthuri Shankar) ఇదే పరిస్థితిలో ఉన్నారా? ఏమో తమిళనాడు పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం అయితే అలానే ఉంది. ఎందుకంటే ఆమె ఇప్పుడు నాట్ రీచబుల్ అని అంటున్నారు.
Kasthuri Shankar
ఇటీవల తమిళనాట జరిగిన ఓ బహిరంగ సభలో తెలుగు ప్రజలపై ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేశారు కస్తూరి. ఆ తర్వాత ఆమె మీద వరుస విమర్శలు, కేసులు కూడా పడ్డాయి. ఈ క్రమంలో ఆమె పరారీలో ఉన్నట్లు తమిళనాడు పోలీసులు ప్రకటించారు. బ్రాహ్మణుల భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరుతూ హిందూ మక్కల్ కట్చి అనే సంఘం ఆధ్వర్యంలో చెన్నైలో జరిగిన ఆందోళనలోనే కస్తూరి ఆ వ్యాఖ్యలు చేశారు.
తమిళనాడు ప్రాంతంలో అంతఃపుర రాణులకు సేవలు చేసేందుకు 300 ఏళ్ల కిందట తెలుగు ప్రజలు తమిళనాడు వచ్చారని, వాళ్లంతా ఇప్పుడు తమది తమిళజాతి అని చెప్పుకుంటున్నారని కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ విషయంలో తెలుగు సమాజం ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే తన వ్యాఖ్యల్లో తప్పును గ్రహించిన కస్తూరి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి తనదేం తప్పు లేదని, డీఎంకేనే కావాలని ఇలా తప్పుడు ప్రచారం చేసిందని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికీ వేడి చల్లారకపోవడంతో భేషరతుగా క్షమాపణలు చెప్పారు.
అయితే అప్పటికే ఆమెపై తమిళనాడులో ఎగ్మూర్, టి నగర్, మధురైలో కేసులు నమోదయ్యాయి. దీంతో ఆమెకు నోటీసులిచ్చేందుకు పోలీసులు ఇంటికి వెళ్లారు. అయితే కస్తూరి అక్కడ లేరు. ఫోన్ కూడా స్విచాఫ్‌లో ఉంది. దీంతో ఆమె పరారీలో ఉన్నారు అని పోలీసులు ప్రకటించారు. దీంతో ఆమెను గాలించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. మరి ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.