మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) పూరి జగన్నాధ్ (Puri Jagannadh) కాంబినేషన్‌లో సినిమా వస్తుందనే వార్త ఎంతోకాలంగా సినీప్రియుల్లో ఆసక్తి రేపింది. “ఆటో జానీ” పేరుతో పూరి జగన్నాధ్ చిరంజీవికి కథను వినిపించినప్పటికీ, కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ముఖ్యంగా, ఈ కథకు సంబంధించిన సెకండ్ హాఫ్ మెగాస్టార్ ఆశించిన విధంగా లేకపోవడం ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఈ అంశం “ఆటో జానీ” ప్రాజెక్టును అప్పట్లో నిలిపివేసింది. అయితే, తాజా సమాచారం ప్రకారం, పూరి జగన్నాధ్ ప్రస్తుతం “ఆటో జానీ” కథను మళ్లీ రీడిజైన్ చేస్తున్నారట.
Puri Jagannadh
మెగాస్టార్ సూచించిన మార్పులకు అనుగుణంగా, ద్వితీయార్థం మరింత బలంగా ఉండేలా కథను అభివృద్ధి చేస్తున్నారు. పూరి తన శైలికి సరిపోయేలా కథను కొత్తగా రాసేందుకు కొంత సమయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మార్పులు పూర్తయిన తర్వాత, చిరంజీవి ఈ కథను ఓకే చేసే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. పూరి ప్రస్తుతం గోపీచంద్‌తో (Gopichand) చేయాల్సిన మరో ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నారు.
ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి ఇంకా రెండు నెలల సమయం ఉండటంతో, “ఆటో జానీ” కథ పనిలో పూరి పూర్తిగా నిమగ్నమయ్యారు. స్టోరీ రాయడంలో తన వేగం, క్రియేటివిటీతో పూరి ఈ కథను తక్కువ సమయంలోనే పూర్తి చేస్తారనే నమ్మకం ఉంది. అయితే గతంలో చిరంజీవి 150వ సినిమాగా ఈ ప్రాజెక్ట్ చేయాలనుకున్నారు. కానీ పూరి వద్ద అప్పట్లో పూర్తి స్థాయి కథ సిద్ధంగా లేకపోవడంతో ఆ ఛాన్స్ వీవీ వినాయక్‌కి దక్కింది.
“ఆటో జానీ” కథకు చిరంజీవి మార్పులు సూచించినా, పూరి (Puri Jagannadh) ఆ మార్పులు చేసేందుకు అప్పట్లో ఆసక్తి చూపలేదని సమాచారం. కానీ ఇప్పుడు, మెగాస్టార్ కోరిక మేరకు ఈ ప్రాజెక్ట్‌కి ప్రాధాన్యత ఇస్తున్నారు. గతంలో చిరంజీవి-పూరి మధ్య ఉన్న బాండింగ్‌కి ప్రూవ్‌గా “గాడ్ ఫాదర్” సినిమాలో పూరి ఒక గెస్ట్ రోల్ చేసిన విషయం తెలిసిందే.