నెపోటిజంతో రౌడీయిజం చేయించాలని చూస్తే… అది ‘గల్లీ రౌడీ’ అవుతుంది. అంతేకాదు ఓ తమిళ సినిమాను స్ఫూర్తిగా తీసుకున్నా కూడా అవుతుంది అంటున్నారు టాలీవుడ్ జనాలు. అవును… సందీప్ కిషన్ ‘గల్లీ రౌడీ’ స్ట్రయిట్ కథ కాదంటున్నారు. ఓ హిట్ తమిళ సినిమా, అందులోనూ తెలుగులో డబ్ అయిన సినిమాను తీసుకొని తెలుగుకు తగ్గట్టుగా మార్చి తీస్తున్నారట. దీనిపై చిత్రబృందం నుండి ఎలాంటి అధికారిక స్పందన లేకపోయినా… పుకార్లు మాత్రం కొనసాగుతున్నాయి.
తమిళంలో ఆ మధ్య వచ్చి ఘన విజయం సాధించిన చిత్రం ‘నానుమ్ రౌడీ దాన్’. తెలుగులో ‘నేనూ రౌడీనే’ అనే పేరుతో తీసుకొచ్చారు. రెండు దగ్గర్లా మంచి పేరే తెచ్చుకుంది. ఇప్పుడు ఆ సినిమా పాయింట్‌ను మెయిన్‌గా తీసుకొని ‘గల్లీ రౌడీ’ సినిమా సిద్ధం చేశారట దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి. ‘నేనూ రౌడీనే’ సినిమాకు విశాఖపట్నం నేపథ్యం తీసుకొని, మరికొంచెం హ్యూమర్ జోడించి తెరకెక్కించారని సమాచారం. అయితే రెండు సినిమాల శైలి ఒకలా ఉండదట.
‘గల్లీ రౌడీ’కి సంబంధించి సినిమా టైటిల్ దగ్గరే తొలుత ఇబ్బంది వచ్చింది. ఈ సినిమాకు తొలతు ‘రౌడీ బేబీ’ అని పేరు పెట్టారు. అయితే కొన్ని కారణాల వల్ల సినిమా పేరు మారుస్తున్నాం అంటూ ‘గల్లీ రౌడీ’ అని చిత్రబృందం ప్రకటించింది. ఇటీవల విడుదలై సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ఊపులో సినిమా వచ్చేస్తోంది అనుకుంటుండగా, కరోనా సెకండ్ వేవ్ వాయిదా పడేలా చేస్తోంది. చూద్దాం… ‘రౌడీ’ సాండీకి ఎంత కలిసొస్తుందో.