ఆ మధ్య ఓ హీరో చెప్పిన మాటలతో ఈ వార్త మొదలుపెడుతున్నాం. ‘‘సినిమాను థియేటర్‌లో చూడండి, బాగుంటే మెచ్చుకోండి. అప్పుడు వదిలేసి ఓటీటీలోకి (OTT) వచ్చి హిట్ చేస్తే ఏమీ ఉపయోగం ఉండదు. ముఖ్యం నిర్మాతకు’’. ఈ మాట ఆ హీరో ఎందుకన్నాడో తెలియదు కానీ.. కచ్చితంగా ప్రస్తుతం టాలీవుడ్ పరిస్థితికి నిలువెత్తు ఉదాహరణగా కనిపిస్తోంది. గత కొన్ని ఏళ్లుగా ఈ పరిస్థితి కనిపిస్తోంది. సినిమా ఇలా ఓటీటీలోకి రాగానే ‘మా సినిమాకు ఓటీటీలో (OTT) విశేష ఆదరణ’ అంటూ ఓ వార్తను ఆ హీరో పీఆర్ టీమ్ తెగ ప్రచారం చేస్తోంది.
అయితే ఆ సినిమా థియేటర్లలో దారుణమైన పరాజయం అందుకొని ఉంటోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ మూడు విషయాలు గుర్తుంచుకోవాలి. థియేటర్లలో చూడాల్సిన ప్రేక్షకులు, ఇప్పుడు ఓటీటీలో చూశారు అంటున్న ప్రేక్షకులు దాదాపు ఒకరే. మరి అక్కడ నచ్చనివారు, ఇక్కడెలా నచ్చుతారు. రెండో పాయింట్ ఓటీటీలో ట్రెండింగ్‌కి కొలమానం ఏంటి? ఏ లెక్కన వాటిని కౌంట్ వేస్తున్నారు. పోనీ సినిమాకొచ్చిన వ్యూస్ అంటే.. ఆ ఓటీటీ సంస్థ చెప్పిన లెక్కలు ఎలా నమ్మగలం.
ఇక మూడో విషయం.. ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కున్న ఓటీటీలు ఆ సినిమాను ట్రెండింగ్ లిస్ట్‌లో టాప్‌లో పెట్టి యూజర్‌కు ‘చూడండి’ అని పుష్ చేస్తుంటాయి. ఇన్ని అంశాలు చుట్టూ ఉండగా ఫ్లాప్ అయిన సినిమా ఓటీటీలో దూసుకుపోతోంది అని చెప్పడం, చెప్పించడం ఒక విధంగా మోసం చేసి జనాలను ఆ యాప్ వరకు తీసుకెళ్లడమే. ఇక్కడో విషయం ఉంది.. థియేటర్లలో జనాలు లేకపోయినా హౌస్‌ఫుల్స్ అవుతున్నాయి అని గతంలో నిర్మాతలు, పంపిణీదారులు చెప్పేవారు.
దాంతో సినిమా బాగుందేమో అని ప్రేక్షకులు అనుకుని వెళ్లేవారు. అలా ఫుల్స్ అయ్యేవి. ఇప్పుడు ఓటీటీల విషయంలోనూ అదే జరుగుతోందా? అంటే అవును అనే సమాధానాలే వస్తున్నాయి. కాబట్టి ఓటీటీలో ట్రెండింగ్ నిజమేనా? అంటే పూర్తిగా కాదు అని చెప్పాలి. ఎందుకంటే హిట్ సినిమాలు కూడా ట్రెండింగ్‌లోకి వస్తుంటాయి కాబట్టి.