అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ పాటికి ‘భీమ్లా నాయక్’ సినిమా గురించి, ఆ సినిమా వసూళ్ల గురించి మాట్లాడుకునేవాళ్లం. కానీ ఏం చేస్తాం… అనుకోని కారణాల వల్ల సినిమా వాయిదాపడింది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మరో నెలలో సినిమా విడుదల చేయాల్సి ఉంది. అయితే తాజాగా వైరల్‌గా మారిన ఓ పుకారు వింటే అభిమానులకు నిరాశ డబుల్ అవుతుంది అంటున్నారు. అభిమానులెవరూ ఇది నిజం కాకూడదు అని కోరుకుంటున్న ఆ వార్తే ఓటీటీ రిలీజ్.
అవును ‘భీమ్లా నాయక్’ను ఓటీటీకి ఇస్తే ఇచ్చేయండి అని పవన్ కల్యాణ్ అన్నారని ఓ చర్చ నడుస్తోంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికిప్పుడు సినిమాలు, అందులోనూ పెద్ద సినిమాలు రిలీజ్ చేసే పరిస్థితి లేదు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ రేట్ల విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. పాత రేట్లతోనే ప్రస్తుతం అమ్మకాలు జరుగుతున్నాయి. అలాగే 50 శాతం ఆక్యుపెన్సీ కూడా అమలులో ఉంది. ఈ సమయంలో థియేటర్‌లో విడుదల చేస్తే నిర్మాతలకు లాభం మాట అటుంచి… ప్రదర్శనకారులకు, థియేటర్ల వాళ్లకు తీవ్ర నష్టాలు తప్పవు. దీంతోనే పవన్ అలా అనుకుంటున్నారని వార్తలొస్తున్నాయి.
మరోవైపు పవన్ సినిమా సోలోగా వస్తే… ఏపీ ప్రభుత్వం నుండి ఇబ్బందులు తప్పవు అనే భయాలు కూడా ఉన్నాయి. గతంలో ‘వకీల్‌సాబ్’ సందర్బంగా కొన్ని సమస్యలు వచ్చిన విషయం తెలిసిందే. టికెట్ రేట్ల సమస్య మొదలైంది ఆ సినిమాతోనే అనే విషయం మనం గుర్తుకు తెచ్చుకోవచ్చు. దీంతో వీటన్నింటిని పరిశీలించి పవన్ కల్యాణ్… ‘ఓటీటీ రిలీజ్’కి అనే ఆలోచన చేశారు అంటున్నారు. దీంతో సరైన ధర వస్తే సినిమా ఓటీటీకి ఇచ్చేస్తారు అని అంటున్నారు.
కానీ ఇప్పటివరకు చాలాసార్లు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ అయితే… థియేటర్స్‌లోనే ‘భీమ్లా నాయక్’ సందడి ఉంటుందని చెప్పారు. పలు సందర్భాల్లో ఈ మాటను నొక్కివక్కాణించారు కూడా. కాబట్టి ఓటీటీ రిలీజ్ అనే మాటను అంత ఈజీగా నమ్మలేం. పవన్ లాంటి హీరో సినిమాను థియేటర్‌లో చూస్తే వచ్చే ఫీల్, ఓటీటీల్లో రాదు అనేది కొట్టిపారేయలేని విషయం. చూద్దాం సితార ఎంటర్‌టైన్మెంట్స్ నుండి ఎలాంటి ప్రకటన వస్తుందో.