సౌత్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకున్న నార్త్ సినిమా “కిల్”. లక్ష్య, రాఘవ్ జుయాల్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమా టీజర్ టైమ్ నుంచే మంచి అంచనాలు నమోదు చేసింది. ఇక సినిమా విడుదలయ్యాక నార్త్ లో కంటే సౌత్ లో ఎక్కువ హౌస్ ఫుల్స్ అయ్యాయి. ఈ విషయాన్ని స్వయంగా సినిమాలో కీలకపాత్ర పోషించిన రాఘవ్ పేర్కొనడం విశేషం. సినిమాలోని యాక్షన్ బ్లాక్స్ కి ఓటీటీ రిలీజ్ తర్వాత భీభత్సమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది.
అయితే.. ఇప్పుడు ఈ “కిల్” చిత్రాన్ని తెలుగు-తమిళ భాషల్లో రీమేక్ చేయడానికి రంగం సిద్దమవుతోందని తెలుస్తోంది. రాఘవ లారెన్స్ (Raghava Lawrence) 25వ చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రానికి రమేష్ వర్మ (Ramesh Varma) దర్శకుడు. ఈ వార్త అఫీషియల్ గా బయటకి వచ్చినప్పట్నుంచి రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. అసలు ఓటీటీలో దుమ్ము లేపుతున్న ఈ సినిమాను రీమేక్ చేయడమే పెద్ద సాహసం కాగా.. ఇటీవలే “ఖిలాడీ” (Khiladi) లాంటి డిజాస్టర్ మూటగట్టుకున్న రమేష్ వర్మ లాంటి ఫ్లాప్ డైరెక్టర్ కి దర్శకత్వ బాధ్యతలు ఇవ్వడంపై కూడా అనుమానాలు రేగుతున్నాయి.
రమేష్ వర్మ తీసిన “రాక్షసుడు” (Rakshasudu) హిట్ అయినప్పటికీ, అప్పట్లో పరభాషా సినిమాలు మనోళ్ళకి సరిగ్గా అందుబాటులోకి లేకపోవడం, ఓటీటీ రిలీజులు అనేవి ఎవరికీ పెద్దగా అవగాహన ఉండకపోవడంతో సరిపోయింది. కానీ ప్రతీ ఇంట్లో ఓటీటీలు తాండవం చేస్తున్న ఈ తరుణంలో ఆల్రెడీ ముబైల్లో అందుబాటులో ఉన్న సినిమాకి ఇప్పుడు కష్టపడి రీమేక్ చేసి రిలీజ్ చేయడం ఎంతవరకు శ్రేయస్కరం అనేది దర్శకనిర్మాతలకే తెలియాలి.
ఇక లారెన్స్ కెరీర్ కూడా అంత ఆశాజనకంగా ఏమీ లేదు. మనోడి మునుపటి చిత్రాలైన “రుద్రుడు, చంద్రముఖి 2 (Chandramukhi 2) , జిగర్తాండ డబుల్ ఎక్స్” (Jigarthanda DoubleX) సినిమాలు కమర్షియల్ గా వర్కవుటవ్వలేదు. సో, ఈ కిల్ సినిమా రీమేక్ అనేది లారెన్స్ & రమేష్ వర్మ కెరీర్లకు చాలా కీలకం కానుంది. మరి రమేష్ వర్మ తరహాలో ఫ్రేమ్ టు ఫ్రేమ్ రీమేక్ చేస్తాడా లేక లారెన్స్ తరహాలో మన నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేస్తాడో చూద్దాం..!!