దర్శక ధీరుడు రాజమౌళి (S. S. Rajamouli) తన బ్రాండ్ ఇమేజ్ తో ఇండియన్ సినిమాకు గర్వకారణంగా నిలిచారు. ఆయన తీసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త చరిత్ర సృష్టించడమే కాకుండా, ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభూతిని అందిస్తుంది. “బాహుబలి,” (Baahubali) “RRR” (RRR) లాంటి చిత్రాలు ఆయన సృజనాత్మకతకు నిలువెత్తు సాక్ష్యం. అయితే, తాజాగా ప్రకటించిన “RRR: బిహైండ్ & బియాండ్” డాక్యుమెంటరీ ఆయన కెరీర్‌లో ఓ కొత్త ప్రయోగం కావడం విశేషం. ఈ డాక్యుమెంటరీ విడుదలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఈ డాక్యుమెంటరీలో RRR వెనుక ఉన్న కష్టాలు, టీమ్ ప్రయత్నం, ఇంటర్నేషనల్ స్థాయిలో అందుకున్న గుర్తింపును చూపిస్తారని చెప్పారు. కానీ ఈ డాక్యుమెంటరీ థియేటర్లలో విడుదల చేస్తుండటంతో పలువురిలో అనుమానాలు మొదలయ్యాయి. ఒక సినిమా వెనుక కష్టాలను ఆస్వాదించేందుకు ప్రేక్షకులు థియేటర్లకు వెళతారా? ఇదే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. ఇంకా, ఈ డాక్యుమెంటరీని కేవలం ఇంగ్లీష్ భాషలోనే విడుదల చేయనున్నట్లు సమాచారం. తెలుగులో కూడా విడుదల చేస్తారా లేదా అనేది క్లారిటీ లేకపోవడం కొంతమందిలో అసంతృప్తి కలిగించింది.
RRR లాంటి సినిమా విజయాన్ని, దానికి వెనుక ఉన్న ప్రయత్నాన్ని తెలుగు, హిందీ ప్రేక్షకులకు చేరువ చేయకపోతే, థియేటర్ ఎకోనామిక్స్‌పై ప్రభావం పడే అవకాశముంది. పైగా, డాక్యుమెంటరీల కోసం ప్రేక్షకులు థియేటర్లకు రావడం చాలా అరుదు. థియేటర్ అనుభవం కోసం వచ్చే ప్రేక్షకులు డాక్యుమెంటరీలకు అంతగా ఆసక్తి చూపరని కొందరి అభిప్రాయం. అందుకే, ఇది ఓటీటీ వేదిక లేదా యూట్యూబ్ ప్లాట్‌ఫామ్‌కు సరైనదని చాలా మంది భావిస్తున్నారు. ఈ డాక్యుమెంటరీ థియేట్రికల్ రన్‌లో వర్కౌట్ అవుతుందా లేదా అనే అనుమానాలు ఇప్పటి నుంచే వ్యక్తమవుతున్నాయి.
రాజమౌళి కెరీర్‌లో ఇప్పటి వరకు ఫ్లాప్ అనేది లేదు. కానీ ఈ డాక్యుమెంటరీ వల్ల థియేట్రికల్ పరంగా ఆయనకు మొదటి డిజాస్టర్ ఎదురవుతుందా? అనే చర్చ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. కానీ రాజమౌళి తన ప్రతి ప్రయత్నాన్ని ఎంతో జాగ్రత్తగా చేస్తారనే నమ్మకం కూడా అందరిలో ఉంది. ఆయన బ్రాండ్ వల్ల కొంతమంది ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే అవకాశం ఉండవచ్చు. మొత్తానికి, ఈ ప్రయోగం రిస్క్‌గా మారుతుందా, లేక అంతర్జాతీయ గుర్తింపును మరింత పెంచుతుందా అనే విషయంలో ప్రేక్షకుల స్పందన చాలా కీలకం. ఈ నెల 20న థియేటర్లలో విడుదలవుతున్న ఈ డాక్యుమెంటరీ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.