ఎక్కడో జరిగిన విషయానికి.. ఇక్కడి విషయానికి లింక్ ఉంటుంది? దీనినే అదేదో బటర్ ఫ్లై ఎఫెక్ట్ అని ఓ సినిమాలో చెప్పాడు ఎన్టీఆర్ (Jr NTR) . దీనికి కాస్త మార్చి అప్పుడెప్పుడో జరిగిన విషయానికి ఇప్పుడు జరగబోయే విషయానికి లింక్ ఉంటుంది.. దీనిని ఇంకేదో ఎఫెక్ట్ అని అంటారు అని లెక్కలేస్తున్న తారక్ ఫ్యాన్స్. ఇందులో నిజానిజాలెంత అనేది తెలియదు కానీ.. గతంలో జరిగిన విషయంలో అంత ప్రభావం చూపించింది కాబట్టి నమ్మాల్సి వస్తోంది.
మీకు బాగా గుర్తుంటే యువ హీరోగా తారక్ అడుగుపెట్టిన కొత్తల్లోనే అదే కుటుంబం నుంచి అదే షార్ట్ నేమ్‌తో మరో హీరో వచ్చాడు. అతనే దివంగత తారకరత్న (Taraka Ratna) . రావడం రావడం తొమ్మిది సినిమాలు ఓపెనింగ్‌తో రికార్డు సృష్టించాడు. అయితే అన్నీ షూటింగ్ జరుపుకున్నాయా? అన్నీ వచ్చాయా? అంటే లేదనే చెప్పాలి. ఆ విషయం వదిలేస్తే ఆ సమయంలో తారక్‌కు తారకరత్న పోటీ అనేలా పరిస్థితి కలిగింది. ఆ మాటకొస్తే కల్పించారు.
ఇప్పుడు మరోసారి అదే పరిస్థితి టాలీవుడ్‌లో రాబోతోందా? నందమూరి కుటుంబం నుండి రాబోతున్న మూడో తరం హీరోకు, నాలుగో తరం హీరో గట్టి పోటీ ఇవ్వబోతున్నాడా? ఇచ్చేలా పావులు కదుపుతున్నారా? గత రెండు రోజులుగా ఇదే చర్చ నడుస్తోంది. దానికి కారణం నందమూరి కుటుంబం నాలుగో తరం నటుడిగా దివంగత హరికృష్ణ మనవడు (Nandamuri Harikrishna) , దివంగత జానకిరామ్(Janaki Ram Nandamuri) తనయుడు తారక రామారావు తెరంగేట్రం చేస్తున్నాడు.
ఇక నందమూరి బాలకృష్ణ (Balakrishna) వారసుడిగా కుటుంబం నుండి మూడో తరం నటుడిగా మోక్షజ్ఞ (Nandamuri Mokshagnya) త్వరలో ఎంట్రీ ఇస్తాడు. దీంతో రాబోయే రోజుల్లో మోక్షజ్ఞ – తారక రామారావు అవుతుంది అని ఓ చర్చ మొదలైంది. ఇలా పోటీ పెట్టడం ద్వారా తారకరత్న వచ్చినప్పుడు తాను ఎదుర్కొన్న పరిస్థితిని తారక్ ఇప్పుడు తిరిగి చూపించబోతున్నాడేమో అనే చర్చ జరుగుతోంది. అయితే ఇదంతా ఊహాగానాలు మాత్రమే అనే వాదనలూ వినిపిస్తున్నాయి. మరి ఎవరి మనసులో ఏముందో సినిమాలు వచ్చేప్పుడు తెలుస్తుంది.