కరోనా సెకండ్ వేవ్ జనాల మీద గట్టిగానే ప్రభావం చూపిస్తోంది. దీంతో ప్రభుత్వాలు ఆంక్షలు విధించడం మొదలుపెట్టాయి. అయితే సినిమాల విషయంలో మాత్రం పెద్దగా మార్పులు చేయడం లేదు. దీంతో ఇటీవల తెలంగాణ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సినిమాల విషయంలో ఎందుకు చర్యలు లేవు అంటూ ప్రశ్నించింది. దీంతో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సినిమా థియేటర్ల ఆక్యపెన్సీ విషయంలో ఆలోచనలు చేస్తోందని వార్తలొస్తున్నాయి. థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ విధానాన్ని మరోసారి తీసుకొస్తారని వార్తలొస్తున్నాయి. దీంతో పెద్ద సినిమాలు విడుదల తేదీని వాయిదా వేసుకుంటున్నాయని టాక్.
నాగచైతన్య, సాయిపల్లవి కాంబోలో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘లవ్‌స్టోరీ’ ఈ నెల 16న విడుదల కావాల్సి ఉంది. అయితే సినిమాను వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం ఇటీవల ప్రకటించింది. విడుదల తేదీ ప్రకటించనప్పటికీ… కొత్త తేదీ మే 13 అని టాక్. నాని ‘టక్ జగదీష్’ను ఈ నెల 23న విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సినిమాను ఒక వారం వాయిదా వేస్తారని టాక్. మే మొదటి వారం సినిమా తీసుకొస్తారని అంటున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ కోసం అభిమానుల ఎదురుచూపులు ఇంకొన్నాళ్లు కొనసాగనున్నాయా ? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. సమ్మర్ స్పెషల్‌గా వస్తుందనుకున్న సినిమా కాస్త… చిరంజీవి బర్త్‌డే స్పెషల్‌గా తీసుకొస్తారట. ఆగస్టు మూడో వారం సినిమాను తీసుకొస్తారని టాక్. అయితే ‘ఆచార్య’ రావాల్సిన టైమ్‌లో మేనల్లుడు ‘పుష్ప’ వచ్చేస్తాడట. తొలుత ‘పుష్ప’ను ఆగస్టు 13న తీసుకొస్తారని చెప్పారు. ఇక మిగిలిన పెద్ద సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్’ విడుదల విషయంలోనూ ఇలాంటి వార్తలే వస్తున్నాయి. విజయదశమి సందర్భంగా వస్తుందనుకున్న ఈ సినిమా క్యాలెండర్ మారాక వస్తుందంటున్నారు.