తెలుగు సినిమా రంగంలో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుల జాబితాలో మరో ఆసక్తికరమైన సినిమా చేరింది. అదే ‘జై హనుమాన్.’ ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా, 2024లో సంచలన విజయాన్ని సాధించిన ‘హనుమాన్’కు (Hanu Man) సీక్వెల్. ‘జై హనుమాన్’ (Jai Hanuman) ప్రాజెక్ట్ మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో రాబోతోందని ప్రకటించిన వెంటనే, బడ్జెట్, స్కేల్ విస్తరించాయనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా, రిషబ్ శెట్టిని (Rishab Shetty) ప్రధాన పాత్రలో తీసుకోవడం వల్ల ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి.
తాజాగా దర్శకుడు ప్రశాంత్ వర్మ, రిషబ్ శెట్టి, దగ్గుబాటి రానాతో (Rana Daggubati) కలిసి ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో రానా పాత్రపై పలు ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ చిత్రంలో రిషబ్ హనుమంతుడిగా కనిపించనున్నాడని క్లారిటీ వచ్చేసింది. ఇక రానా పాత్రపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇన్‌సైడ్ టాక్ ప్రకారం, రానా ఈ సినిమాలో రావణాసురుడి పాత్ర పోషించే అవకాశం ఉందని సినీ వర్గాలు అంటున్నాయి.
రానా గంభీర రూపం, ఆవాజ్, పర్సనాలిటీ రావణుడి పాత్రకు పర్ఫెక్ట్ ఫిట్ అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ‘జై హనుమాన్’లో రాముడి పాత్రలో ఎవరుంటారు అనేది ఇంకా ఖరారు కాలేదు. ఈ విషయంపై ఇంకా క్లారిటీ రానప్పటికీ, ప్రేక్షకుల్లో ఆసక్తి మామూలుగా లేదనే చెప్పాలి. ఇక దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రస్తుతం మోక్షజ్ఞ (Nandamuri Mokshagnya) డెబ్యూ ప్రాజెక్ట్‌పై ఫోకస్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాతే ‘జై హనుమాన్’ షూటింగ్ ప్రారంభమవుతుందని భావిస్తున్నారు.
ఈ తరుణంలోనే మరో ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘మహాకాళి’ని కూడా ప్రకటించి తన క్రేజ్ ను మరింత బలపర్చుకున్నారు. 2025లో రిషబ్ శెట్టి ‘కాంతార 2’ విడుదల అయ్యే అవకాశం ఉంది. అందువల్ల 2026లో ‘జై హనుమాన్’ (Jai Hanuman) విడుదల కావచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా ప్రేక్షకులను అద్భుత అనుభూతికి తీసుకువెళ్లడానికి దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారో చూడాలి.