‘గుంటూరు కారం’… చాలా నెలల క్రితమే అనౌన్స్ అయ్యి, అక్కడికి కొద్ది రోజులకు కొబ్బరికాయ కొట్టుకుని, ఆ తర్వాత చాలా రోజులకు మొదలైందీ చిత్రం. అయితే అనూహ్యంగా తొలి షెడ్యూల్ తర్వాత సినిమా చాలా కాలం ఆగిపోయింది. ఇలా ఈ సినిమా షూటింగ్‌లోనే చాలా ట్విస్ట్‌లు ఉన్నాయి. తాజాగా సినిమా గురించి మరో ట్విస్ట్ బయటకు వచ్చింది. ఒకవేళ అది నిజమైతే ఇన్నాళ్లూ అఫీషియల్ పుకారుగా చలామణి అవుతున్న ఓ విషయం అబద్దం అవుతుంది.
‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమాలో పొలిటికల్ టచ్ ఉందనే విషయం మీకు తెలిసిందే. దానికి తగ్గట్టే సినిమాకు ‘అమరావతికి అటు ఇటు’ అని పేరు కూడా పెడతారని వార్తలొచ్చాయి. అయితే వివిధ కారణాల వల్ల సినిమాకు ‘గుంటూరు కారం’ అని పేరు పెట్టారు. అయితే సినిమా కథలో అనుకున్న ఆ రాజకీయం అలానే ఉంచారని అన్నారు. ఇటీవల అయితే ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ రాజకీయ నాయకుడిగా కనిపిస్తారని, తాతగా నటిస్తున్నారని మరో పుకారు బయటికొచ్చింది. కానీ ధమ్ మసాలా సాంగ్ రావడం వల్ల వేరే విషయం బయటకు వచ్చింది.
హీరో మహేష్‌బాబు బర్త్‌డేకు కానుకగా వస్తుంది అని చెప్పిన ఫస్ట్ సాంగ్ ఎట్టకేలకు దర్శకుడు త్రివిక్రమ్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేశారు. ఇందులో మహేష్ స్వాగ్, విజువల్స్, లిరిక్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. అయితే కొన్ని విజువల్స్ చూస్తే సినిమా లైన్ గురించి ఆసక్తికర డీటెయిల్స్ తెలుస్తున్నాయి అంటున్నారు. విజువల్స్ ప్రకారం, లిరిక్స్ ప్రకారం ఈ సినిమాలో మహేష్, ప్రకాశ్ రాజ్ రాజ్ తండ్రీకొడుకులుగా కనిపిస్తారట. అంతేకాదు ప్రకాశ్ రాజ్ రాజకీయంలో ఉండటం నచ్చక మహేష్ కుటుంబానికి దూరంగా ఉంటాడట.
అలాగే ఆ పాటలో పొలిటికల్ పాంప్లేట్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే సినిమాలో తండ్రి – కొడుకుల ఎమోషన్, విలేజ్ రాజకీయాల మేళవింపుగా సినిమా ఉండబోతోంది అని అర్థమవుతోంది. మహేష్ ఎందుకు దూరంగా ఉన్నాడు, ఎప్పుడు తిరిగి దగ్గరకొచ్చాడు. వచ్చాక ఏమైంది అనే అంశాలు సినిమాలు కీలకం అని చెబుతున్నారు.