పొట్టి పేరు.. గట్టి హిట్ అంటూ ఈ మధ్యే మనం ఓ హిట్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకున్నాం గుర్తుందా? ఇప్పుడు అదే కాన్సెప్ట్‌ను ఫాలో అవుతూ రామ్‌చరణ్ సినిమాకు శంకర్ ఓ టైటిల్ ఫిక్స్ చేశారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. రామ్‌చరణ్ – కియారా అడ్వాణీ జంటగా దిల్ రాజు ఓ సినిమా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పేరు ఇదే అంటూ గత రెండు రోజులుగా ఓ పేరు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంతే కాదు ఈ మేరకు టైటిల్ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది అంటున్నారు.
ప్రభుత్వ అధికారి.. ప్రజల కోసం ప్రభుత్వం మీద ధ్వజమెత్తితే అనే కాన్సెప్ట్‌తో శంకర్ – చరణ్ సినిమా రూపొందుతోందని వార్తలొస్తున్నాయి. ఈ మేరకు షూటింగ్లో కొన్ని సీన్స్ అలానే ఉన్నాయి అని కూడా అంటున్నారు. రాజకీయం, నాయకుల ఆలోచనలు కూడా ఈ సినిమాలో చూపించబోతున్నారు. రాజమహేంద్రవరం ప్రాంతంలో షూటింగ్ జరిపినప్పుడు బయటికొచ్చిన ఫొటోల్లో ఈ విషయం తెలిసిందే. ఇలా మొత్తంగా రాజకీయం, ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్న ఈ సినిమా కథకు CEO అనే పేరు పెట్టారని సమాచారం.
ఉగాది – రామ్‌చరణ్ పుట్టిన రోజు వారంలో సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ చేస్తారని సమాచారం. మార్చి 22న ఉగాది ఉంది, 27న రామ్‌చరణ్ పుట్టిన రోజు. ఆ సమయంలోనే సినిమా లుక్స్ రిలీజ్ అని అంటున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాకు ఇలాంటి షార్ట్ ఫామ్ టైటిల్ అయితే క్యాచీగా ఉంటుంది అని చెబుతున్నారు. అయితే CEO పూర్తి పేరు ఏంటి అనేది తెలియాల్సి ఉంది.
ఈ సినిమాలో రామ్‌చరణ్ ప్రభుత్వ అధికారిగా కనిపిస్తాడు అని వార్తలు ఇప్పటికే వచ్చాయి. అయితే ఆ అధికారి పాత్ర చీఫ్ ఎలక్టోరియల్ ఆఫీసర్ అవ్వొచ్చు అని అంటున్నారు. ఆ పదవిని CEO అనే అంటారు. ఇక ఈ సినిమా చిత్రీకరణ దాదాపు 50 శాతం పూర్తయ్యిందని సమాచారం.