రాజకీయ సినిమాలు – రామ్‌గోపాల్ వర్మ.. ఈ కాంబినేషన్ ఏమంత విజయవంతమైనది కాదు. గతంలో ఆయన రాజకీయ నేపథ్యంలో తీసిన సినిమాలు ఓ వర్గానికి ఆనందాన్నిచ్చాయి కానీ.. సినిమాగా మాత్రం విజయం సాధించలేకపోయాయి. ఆయన ఆ సినిమాలో నిజాలు చెప్పారు అని అన్నా.. ఏదో ఉడుకుబోతుతనంతో చెప్పినట్లు అనిపిస్తుంటుంది. ఇప్పుడు ఆయన ‘వ్యూహం’, ‘శపథం’ అనే రెండు సినిమాలు చేయబోతున్నారు. వైసీపీ నేత దాసరి కిరణ్ ఫండింగ్‌తోనే ఈ సినిమాలు రానున్నాయి.
అయితే, ఇక్కడే ఓ విషయం తెలుస్తోంది. దాని ప్రకారం చూస్తుంటే ఈ సినిమాల వల్ల వైసీపీకి ఎంత లాభం ఉందో తెలియదు కానీ.. వర్మకు అయితే మంచి లాభమే అని అంటున్నారు. ఈ మధ్య కాలంలో చిత్రరాజాలు తీసి.. పెద్ద ఎత్తున నష్టాలు మూటగట్టుకున్నారు వర్మ. ఇప్పుడు ‘వ్యూహం’, ‘శపథం’ పేరుతో తీస్తున్న సినిమాల వల్ల వర్మకు రూ. 60 కోట్లు ఇస్తున్నారని ఓ టాక్ టాలీవుడ్‌లో, పొలిటికల్ ఫీల్డ్‌లో నడుస్తోంది. ఒకవేళ అదే నిజమైతే.. ఆ సినిమాలు తీయగా మిగిలిన డబ్బులతో వర్మ నష్టాలు తీరిపోతాయి అని చెబుతున్నారు.
వర్మ తీసే సినిమాలకు రూ.60 కోట్లు అవ్వదు అనే విషయం చాలామంది తెలిసిందే. ఆ లెక్కన చాలానే మిగుల్చుకుంటారు అనేది పక్కాగా చెప్పొచ్చు. అయితే ఇంత ఖర్చు పెట్టి వైసీపీ ఏం చెయ్యాలి అనుకుంటోంది. తన పార్టీ కార్యకర్తలు, అభిమానుల ఆనందం కోసమే సినిమా చేయాలని అనుకుంటున్నారా? అనేదే ఇక్కడ ప్రశ్న. అందులో వర్మ ఏం చెబుతారు అనేది ఆసక్తికరం. చెప్పాల్సినవి సరిగ్గా చెప్పకపోతే ఆ విషయాలు బూమరాంగ్ అయ్యి తిరిగి వైసీపీనే ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో ఈ సినిమాల విషయంలో జగన్ పార్టీ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అనే మాటలూ వినిపిస్తున్నాయి. రాజకీయ కనెక్షన్ ఉన్న సినిమాల్లో లేనిది ఉన్నట్లు చెబితే.. ప్రేక్షకులు గుర్తుపట్టేస్తారు. ఇది నిజం కాదు కదా అనేస్తారు. ‘ఎన్టీఆర్ నాయకుడు’ సినిమాలో ఇదే జరిగింది. చంద్రబాబుకు అనుకూలంగా కొన్ని సీన్స్ ఉండేసరికి.. నిజం కాదంటూ కామెంట్స్ వినిపించాయి. ఎందుకంటే కరెంట్ పాలిటిక్స్ అందరికీ తెలుసు కాబట్టి.