పీఆర్ విషయంలో మెగా హీరోలు కాస్త తక్కువ అని చెబుతుంటారు. మిగిలిన హీరోల పీఆర్ టీమ్‌లు వేగంగా దూసుకుపోతుంటే మెగా హీరోలు.. నెమ్మదిగా ఉంటారు అనే అపవాదు ఉంది. అయితే ఇప్పుడు దీనికి చెక్ పెడుతూ రామ్‌చరణ్ తన పీఆర్ టీమ్‌ను పెట్టుకున్నాడు. అందుకే ఆస్కార్ ప్రచారం కోసం అమెరికా వెళ్లిన చరణ్ అప్‌డేట్స్ త్వరగా మీడియాకు వచ్చాయి. అయితే అదే టీమ్‌లో ఓ ఔత్సాహికుడు చేసిన పని ఇప్పుడు చరణ్ తలపట్టుకునేలా చేసింది. దీనంతటికి కారణం చరణ్ కామ్ డీపీనే.
మార్చి 27న రామ్‌చరణ్ పుట్టిన రోజు అనే విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన టీమ్ ఓ కామన్ డీపీ విడుదల చేసింది. రామ్‌చరణ్ గురించి గొప్పగా చెప్పేలా ఆ డీపీని సిద్ధం చేశారు. మామూలుగా అయితే సినిమాలో చేసిన పాత్రలో, అతని ఇమేజో, గొప్పతనం చెప్పేలానో డీపీ ఉంటుంది. కానీ టీమ్ ఈసారి కొత్తగా ట్రై చేసింది. చరణ్ గ్లోబల్ హీరో అనే విషయం గుర్తు చేసేలా, చెప్పేలా ఓ ఫొటో రిలీజ్ చేశారు. అయితే ఈ క్రమంలో అవార్డులు, మీడియా వార్తలకు స్థానం తగ్గించి ఇబ్బంది కలిగించారు అనే విమర్శలు వస్తున్నాయి.
రామ్‌చరణ్ కామన్ డీపీ మీరు ఇప్పటికే చూసి ఉంటారు కూడా. లేదంటే పైన ఇమేజ్‌లో ఉన్నది అదే. ఫొటోలో రామ్ చరణ్ స్టయిల్‌గా టేబుల్ దగ్గర ఉన్నాడు. దాని మీద కొత్తగా వచ్చిన గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ (ఆయన సినిమాకు వచ్చిన) అవార్డులు ఉన్నాయి. అయితే కిందన నేల మీద చరణ్ పక్కన ఫిల్మ్ ఫేర్ అవార్డులు, మరోపక్కన నందీ అవార్డులు పెట్టారు. దీంతోనే సమస్య వచ్చిపడింది. ప్రతిష్ఠాత్మకమైన మన దేశం అవార్డులను అలా నేల మీద పడేస్తారా అని అంటున్నారు కొంతమంది నెటిజన్లు.
ఇక పేపర్‌లో వచ్చిన వార్తల క్లిప్పింగ్‌లు, ఇతర బొమ్మల లాంటివి సరేసరి. చిరంజీవి పూజించే అంజనీ పుత్రుడి బొమ్మ ఉన్న కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ సింబల్ ఉన్న ప్రింట్ కూడా కిందనే ఉంది. దీంతో క్రియేటివిటీ పేరుతో ఇలా తక్కువ చేస్తారా అని అంటున్నారు. మరి దీన్ని చరణ్ ఏమన్నా సరిదిద్దుకుంటాడేమో చూడాలి. లేదంటే ఇన్నాళ్లు పీఆర్ టీమ్ చేసిందంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది.