హనుమాన్ (Hanu Man) సినిమాతో పాన్ ఇండియా హిట్‌ను సాధించిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prasanth Varma), సీక్వెల్ జై హనుమాన్‌ను ప్రకటించి అభిమానుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేశారు. హనుమాన్ కంటెంట్‌కు అందరూ ఫిదా అయిపోవడంతో, సీక్వెల్ మీద భారీగా హైప్ పెరిగింది. 2025 లో రిలీజ్ అనే టార్గెట్ కూడా మొదట పెట్టారు. కానీ ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఇది తొందరగా సాధ్యపడటం కష్టమే అనే సందేహాలు మొదలయ్యాయి. జై హనుమాన్ (Jai Hanuman) షూటింగ్ ఇప్పటికీ ప్రారంభం కాలేదు.
ఈ సినిమాలో లీడ్ రోల్ కోసం ప్రశాంత్ వర్మ రిషబ్ శెట్టిని (Rishab Shetty) ఫిక్స్ చేశారు. అయితే రిషబ్ శెట్టి ప్రస్తుతం కాంతారా 2 సినిమా పని మీద పూర్తిగా బిజీగా ఉన్నాడు. నటుడిగా మాత్రమే కాదు, దర్శకుడిగా కూడా తన 100% ఇస్తున్నాడు. కాంతారా పూర్తయ్యే వరకు మరో ప్రాజెక్ట్‌కు కమిట్ కావడం లేదని క్లియర్ గా చెప్పేశాడు. దీంతో జై హనుమాన్ సెట్స్ మీదకి వెళ్లే విషయంలో అనిశ్చితి ఏర్పడింది. ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో డేట్స్ వచ్చే ఛాన్స్ ఉన్నా.. అది ఖచ్చితంగా కన్‌ఫర్మ్ కాదు.
ఇప్పటికీ రిషబ్ నుండి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ప్రశాంత్ వర్మ ఇతర పనుల్ని పూర్తి చేసే పనిలో పడ్డాడు. స్క్రిప్ట్ ఫైనల్ డ్రాఫ్ట్, ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుతున్నాడు. అయినా ఈ ఇయర్ లో సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈ ఇయర్ ఎండింగ్ లో స్టార్ట్ అయినా, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ మొత్తానికి కనీసం సంవత్సరం పడుతుంది. సో 2025 రిలీజ్ అనేది నమ్మడం కష్టమే. 2026 చివర లేదా 2027 ఆరంభంలోనే జై హనుమాన్ (Jai Hanuman) చూడొచ్చని టాక్.
జై హనుమాన్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, మేకింగ్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. కథ, స్కేల్, నటీనటుల ఎంపిక విషయంలోనూ నెక్ట్స్ లెవెల్ విజన్ పెట్టుకున్నారు. ప్రశాంత్ వర్మ మరో రెండు ప్రాజెక్టులు ప్రకటించినా, ప్రస్తుతం మొత్తం ఫోకస్ జై హనుమాన్ మీదే పెట్టాడు. అభిమానులు కూడా ఈ ప్రాజెక్ట్ గురించి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.