దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు నటిస్తోన్న ఈ భారీ మల్టీస్టారర్ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చరణ్, ఎన్టీఆర్ ల పాత్రలకు సంబంధించిన వీడియోలు రిలీజ్ చేసి యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ లాంటి పాత్రలను తీసుకొని కల్పిత కథతో సినిమాను రూపొందిస్తున్నారు రాజమౌళి.
తాజాగా ఈ కథలో మరో చారిత్రాత్మిక ఘట్టాన్ని కూడా యాడ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో కీలక ఘట్టమైన జలియన్ వాలాబాగ్ ఉదంతాన్ని ఈ సినిమాలో రాజమౌళి చూపించబోతున్నారని టాక్. భారత స్వాతంత్య్ర ఘట్టంలో అత్యంత చేదైన ఘటన ఇది. జనరల్ డయ్యర్ ఆదేశాల మేరకు బ్రిటీష్ సైన్యం విచక్షణా రహితంగా చేసిన కాల్పులలో దాదాపు వేయి మంది భారతీయులు మరణించారు. ఈ ఘటన భారతీయుల్లో మరింత కసిని పెంచిందని చెబుతారు. ఒకరకంగా స్వాతంత్య్ర ఉద్యమాన్ని మలుపు తిప్పిన ఘటన ఇదే.
ఈ ఉదంతాన్ని ‘ఆర్ఆర్ఆర్’లో చూపించాలని అనుకుంటున్నాడట రాజమౌళి. నిజానికి అల్లూరి, భీమ్ కథలకు.. జలియన్ వాలాబాగ్ ఉదంతానికి ఎలాంటి సంబంధం లేదు. వీటన్నింటినీ కలుపుతూ తన ఫిక్షనల్ కథతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నాడు రాజమౌళి. మరి ఈ కథలో జలియన్ వాలాబాగ్ ఎపిసోడ్ ని ఎక్కడ యాడ్ చేస్తారో చూడాలి!