విజయ్ ఆఖరి చిత్రం అంటూ అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న చిత్రం ‘జన నాయగన్’. తెలుగులో ‘జన నాయకుడు’గా రిలీజ్ చేయనున్నారు. బాలకృష్ణ – అనిల్ రావిపూడి ‘భగవంత్ కేసరి’ సినిమా కథ స్ఫూర్తితో విజయ్ మార్కు సంభాషణలతో ఈ సినిమాను సిద్ధం చేసుకున్నారు. అయితే ఆ మార్పులే ఇప్పుడు సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ రాకుండా ఆపుతున్నాయని సమాచారం. ప్రభుత్వాల మీద విజయ్ వేసిన పంచ్‌లే రిలీజ్‌కి అడ్డు అని చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా విడుదలలో జాప్యం గురించి నిర్మాత కేవీఎన్ రియాక్ట్ అయ్యారు.
దశాబ్దాల పాటు అభిమానులను అలరించిన విజయ్‌కు సినిమాల నుండి వీడ్కోలు దక్కాలని ఆకాంక్షించాం. అయితే ప్రస్తుతం పరిస్థితి మా చేయి దాటిపోయింది అని ఆవేదన వ్యక్తం చేశారు. షూటింగ్ పూర్తయిన తర్వాత సినిమాను డిసెంబర్ 18, 2025న సెన్సార్ బోర్డుకు పంపించాం. డిసెంబర్ 22న యూ/ఏ సర్టిఫికెట్ ఇస్తామని చెప్పి.. కొన్ని మార్పులు సూచించారు. ఆ మార్పులు చేసి సినిమాను మళ్లీ సెన్సార్ బోర్డుకు పంపాం. విడుదలకు సిద్ధం చేసుకుంటున్న సమయంలో జనవరి 5న సినిమాపై ఫిర్యాదులు వచ్చాయని దీన్ని రివైజింగ్ కమిటీకి రిఫర్ చేస్తున్నట్లు సెన్సార్ నుండి మెయిల్ చేసింది.

రివైజింగ్ కమిటీని సంప్రదించడానికి సమయం మించిపోవడం, అసలు ఎవరు ఫిర్యాదు చేశారో స్పష్టత లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాం అని నిర్మాత కేవీఎన్ తెలిపారు. అలాగే ఇది విపత్కర సమయం అని భావోద్వేగానికి గురయ్యారు. ‘జన నాయగన్’ విడుదల గందరగోళ పరిస్థితిలో పడింది. తమిళనాడులో ఎన్నికలు ఉండడంతో ఈ ప్రక్రియ కష్టంగా మారింది. ఈ సినిమా కోసం సంవత్సరాల తరబడి కష్టపడిన వారికి కృతజ్ఞతలు. ఈ సినిమా సరైన సమయానికి వస్తుందనుకున్న అభిమానులకు, పంపిణీదారులకు క్షమాపణలు చెబుతున్నాను. చట్టపరమైన సమస్యల కారణంగా పరిస్థితి మా చేయి దాటిపోయింది అని భావోద్వేగానికి గురయ్యారు.
సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డుకు తొలుత మద్రాసు హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ తీర్పును సవాల్ చేస్తూ సెన్సార్ బోర్డు మద్రాసు హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. సెన్సార్ సర్టిఫికెట్ జారీపై స్టే విధించింది. తదుపరి విచారణను జనవరి 21కి వాయిదా వేసిన విషయం తెలిసిందే.
