సీనియర్ స్టార్ నటుడు జయప్రకాశ్ రెడ్డి (Jaya Prakash Reddy) అందరికీ సుపరిచితమే. రాయలసీమ మాండలికంలో మొదట్లో తన విలనిజంతో భయపెట్టి.. తర్వాత అదే మాండలికంలో నవ్వులు కూడా పూయించారాయన. ఈయన ఎక్స్ప్రెషన్స్ కి అంతా ఫిదా అయిపోయేవారు. అయితే ఈయన వ్యక్తిగత జీవితం గురించి చాలా మందికి తెలీదు. ఈయన స్వతహాగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన గుంటూరు వాసి అయినప్పటికీ రాయలసీమకు చెందిన వ్యక్తిగా పాపులర్ అయ్యారు. అలాగే ఈయనకి 2 పెళ్ళిళ్ళు అయినట్టు కూడా చాలా మందికి తెలీదు.
ఈయన విషయాన్ని స్వయంగా ఆయన కుమార్తె మల్లిక ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. జయప్రకాశ్ రెడ్డి కూతురు మల్లిక మాట్లాడుతూ… “మా నాన్నగారికి 22 ఏళ్ల వయసులోనే పెళ్లైంది. కానీ ఎందుకో 8 ఏళ్లు గడిచినా ఆయనకు సంతానం కలగలేదు. దీంతో మా తాతగారు వాళ్ళు ఆయనకు 2వ వివాహం చేశారు. తర్వాత ఆయనకు మొదటి సంతానంగా నేను జన్మించాను.
మా నాన్నగారికి నటన, నాటకాలు అంటే చాలా ఇష్టం. అదే ఆయన్ని సినిమాల వైపు మళ్లించింది. 1985లో ఆయన పలు సినిమాల్లో నటించారు. కానీ ఆయనకు అంతగా గుర్తింపు రాలేదు. దీంతో 1992లో ఆయన ఇండస్ట్రీని విడిచి గుంటూరుకి వచ్చేశారు. కొన్నాళ్ల పాటు మా ఊర్లో పిల్లలకు ట్యూషన్స్ చెప్పుకునేవారు. కొన్నేళ్ల తర్వాత ఆయనకు ‘ప్రేమించుకుందాం రా’ (Preminchukundam Raa) సినిమాలో అవకాశం వచ్చింది.
గుంటూరు వాసి అయిన మా నాన్నగారు రాయలసీమ మాండలికం వాడటం మొదలు పెట్టింది ఈ సినిమాతోనే. తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. చచ్చే వరకు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూనే వచ్చారు” అంటూ చెప్పుకొచ్చారు.