“ఆర్ఆర్ఆర్”తో (RRR) తెలుగు వారికి దగ్గరైన ఆలియా భట్ (Alia Bhatt) నటించడమే కాక నిర్మాణ భాగస్వామిగానూ వ్యవహరించిన తాజా చిత్రం “జిగ్రా” (Jigra) . వసన్ బాలా (Vasan Bala) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ & ట్రైలర్ మంచి అంచనాలను నెలకొల్పాయి. మరి దసరా కానుకగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!
Jigra Movie Review
కథ: చిన్నప్పుడే తల్లిని కోల్పోవడం, చిన్న వయసులోనే తండ్రి ఆత్మహత్య చేసుకొని చనిపోవడంతో.. పెదనాన్న దగ్గర పెరుగుతారు అక్కాతమ్ముళ్లు సత్యభామ (ఆలియా భట్) & అంకుర్ (వేదాంగ్ రైనా) (Vedang Raina) . ఒక బిజినెస్ ట్రిప్ మీద వేరే దేశానికి వెళ్లిన అంకుర్ డ్రగ్స్ కేసులో ఇరుక్కుని అక్కడ కోర్టుతో మరణ శిక్ష విధించబడి జైల్లో వేయబడతాడు. అక్కడి నుండి అతడ్ని సత్యభామ ఎలా బయటకు తీసుకొచ్చింది? అందుకు ముత్తు (రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran), శేఖర్ భాటియా (మనోజ్ పహ్వా (Manoj Pahwa ) ఎలా సహాయపడ్డారు? అనేది “జిగ్రా” (Jigra )కథాంశం.
నటీనటుల పనితీరు: ఆలియా ఉత్తమ నటి అని విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ చిత్రంలో తమ్ముడిని రక్షించుకోవడం కోసం ఎంతకైనా తెగించే అక్క పాత్రలో జీవించేసింది. అయితే.. ఆమె పాత్రకు సరైన క్యారెక్టర్ ఆర్క్ లేదు. ఆ కారణంగా ఆమె నటనను మెచ్చుకున్నప్పటికీ.. ఆ క్యారెక్టర్ కు కనెక్ట్ అవ్వలేము. వేదాంగ్ రైనాకు ఇది రెండో సినిమా అయినప్పటికీ.. మంచి నటనతో ఆకట్టుకున్నాడు. మనోజ్ పహ్వా భలే అలరిస్తాడు.
అతడి పాత్ర కానీ, అతడి హావభావాలు కానీ మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి. రాహుల్ రవీంద్రన్ కు మంచి క్యారెక్టర్ లభించింది. తన పాత్రకు న్యాయం చేశాడు కూడా. నిజానికి ఆలియా తర్వాత సినిమాలో గుర్తుండిపోయే పాత్ర రాహుల్ దే. ఇక బాలీవుడ్ నుండి వరుసబెట్టి సహాయ పాత్రలు రావడం ఖాయం.
సాంకేతికవర్గం పనితీరు: స్వప్నిల్ (Swapnil S. Sonawane) సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి మెయిన్ ఎస్సెట్. సినిమా మొత్తాన్ని మోనోటోన్ లో తెరకెక్కించిన తీరు, యాక్షన్ బ్లాక్స్ ఫ్రేమింగ్స్ బాగున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ యాక్షన్ బ్లాక్ థ్రిల్ చేస్తుంది. ఆ సీక్వెన్స్ ను కాస్త లాజికల్ గా తెరకెక్కించిన విధానం బాగుంది. అంచిత్ టక్కర్ (Achint) & మన్ ప్రీత్ సింగ్ ద్వయం అందించిన బాణీలు బాగున్నాయి. టైటిల్ ట్రాక్ మనతో ట్రావెల్ చేస్తుంది. ఆ సాంగ్ స్లోమోషన్ ప్లేస్మెంట్ కూడా భలే వర్కవుట్ అయ్యింది.
దర్శకుడు మూలకథను నెట్ ఫ్లిక్స్ సినిమా “ఎక్స్ ట్రాక్షన్” నుండి స్ఫూర్తి పొంది దానికి ఇండియన్ సెంటిమెంట్ యాడ్ చేసి “జిగ్రా” కథను రాసుకున్న తీరు బాగుంది కానీ.. ఆ కథను ఎంగేజింగ్ గా నడిపించడంలో విఫలమయ్యాడు. థ్రిల్లింగ్ గా సాగాల్సిన కథ కాస్తా ఎమోషన్స్ మరీ ఎక్కువగా సాగదీయడంతో బోర్ కొట్టేస్తుంది.
జైల్ బ్రేక్ సీక్వెన్స్ బాగున్నప్పటికీ.. ఆ ఒక్క సీక్వెన్స్ కోసం క్లైమాక్స్ వరకు వెయిట్ చేయాల్సి రావడం ఆడియన్స్ కు బోర్ కొట్టిస్తుంది. ఎమోషన్ ఎలాగు ఉంది కాబట్టి నిడివి తగ్గించుకొని ఇంకో యాక్షన్ బ్లాక్ యాడ్ చేసి ఉంటే సినిమాకి మంచి స్పందన వచ్చేది. కథనంలో వేగం, కథలో పట్టు లేకపోవడంతో దర్శకుడిగా, రచయితగా వసన్ బాల బొటాబొటి మార్కులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
విశ్లేషణ: ఒక సినిమాను యాక్షన్ డ్రామాగా పబ్లిసిటీ చేసినప్పుడు ప్రేక్షకులు కనీస స్థాయి యాక్షన్ ను ఆశించి థియేటర్స్ కి వస్తారు. అవి లోపించినప్పుడు నీరసపడి థియేటర్లను వీడతారు. “జిగ్రా” విషయంలోనూ అదే జరిగింది. ఆలియా భట్ లాంటి మంచి నటి, అంచిత్ టక్కర్ కదిలించే నేపథ్య సంగీతం ఉన్నప్పటికీ.. వేగవంతమైన కథనం, ఆశించిన స్థాయి యాక్షన్ బ్లాక్స్ & క్యారెక్టర్ ఆర్క్స్ లేకపోవడంతో “జిగ్రా” ఓ యావరేజ్ సినిమాగా మిగిలిపోయింది.