రాయలసీమ నేపథ్య కథ… త్రివిక్రమ్ దర్శకత్వం.. ఈ రెండూ ఎన్టీఆర్ కి చాలా ఇష్టం. ఈ రెండింటిని ఒకేసారి కలిపి చేశారు. అదే అరవింద సమేత వీర రాఘవ సినిమా. సినిమా విడుదలకు మరో రెండు రోజులు ఉన్నప్పటికీ అభిమానులు సందడి మొదలయిపోయింది. ఈ సినిమా టీజర్, ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ ఫస్ట్ డే చూడనిదే నిద్ర పోయేట్టు లేరు. అలాంటి క్రేజ్ ని ఈ మూవీ సొంతం చేసుకుంది. దీని తర్వాత దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించనున్న సంగతి తెలిసిందే. అతని దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్. ఇప్పుడు మళ్ళీ ఆ కాంబినేషన్ అనగానే మొదలుకాకముందే ఆ చిత్రం గురించి తెలుసుకోవాలనే ఆరాటం పెరిగింది. రామ్ చరణ్ తేజ్ మరొక హీరోగా నటిస్తుండడంతో ఈ మల్టీస్టారర్ మూవీపై అందరి కన్ను పడింది.
ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది ?.. హీరోలు ఎప్పుడు షూటింగ్ లోకి అడుగు పెడతారు? అనేది ఇంకా అధికారికంగా బయటికి రాలేదు. ఇదే విషయాన్ని ఎన్టీఆర్ ని అడగగా ఇలా స్పందించారు. “ఆ సినిమా గురించి అన్నీ రాజమౌళే చెబుతారు. “త్వరగా స్టార్ట్ చెయ్యి” అని జక్కన్నతో అన్నా. ఇంకా నాకు ఆయన నుంచి కబురు రాలేదు” అని స్పష్టం చేశారు. రాజమౌళి తో సినిమా అంటే రెండేళ్లు పడుతుందని అభిప్రాయం ఉంది.. ఈ సినిమా కూడా అలాగే జరుగుతుందా? అని ప్రశ్నించగా.. “ఈ సినిమా షూటింగ్ రెండేళ్లపాటు ఉండదని అనుకుంటున్నా. త్వరగానే ఫినిష్ అయిపోవచ్చు” అని ఎన్టీఆర్ వెల్లడించాడు. ఆ సినిమా తర్వాత కొరటాల శివతో ఓ సినిమా చేయనున్నట్లు వివరించారు.