ఎన్టీఆర్ (Jr NTR) మొదటిసారి బాలీవుడ్‌లో అడుగుపెదుతున్న సినిమా ‘వార్ 2’. దాదాపు షూటింగ్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ ప్రాజెక్ట్‌పై ఎన్టీఆర్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. హృతిక్ రోషన్‌తో (Hrithik Roshan) కలిసి నటిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారని బాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నిజమైతే, ఎన్టీఆర్ నటనలోని మరో వైవిధ్యాన్ని ప్రేక్షకులు ఆస్వాదించవచ్చు. ఇటీవల హృతిక్ రోషన్ మాట్లాడుతూ ఎన్టీఆర్‌తో డాన్స్ చేయడం తనకు ఒక కొత్త అనుభవంగా మారిందని, తనకూ చాలావరకు కష్టపడాల్సి వచ్చిందని చెప్పడం ఈ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.
ఇక యాక్షన్ సన్నివేశాల్లో ఎన్టీఆర్, హృతిక్‌ల మధ్య ఉండే పోటీ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేయనుందట. ఇద్దరి మధ్య సీక్వెన్స్‌లు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయన్నది బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ‘వార్ 2’ లో ఎన్టీఆర్ లుక్ ఎలా ఉండబోతుందో తెలుసుకునేందుకు అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఒక ఆన్ లొకేషన్ స్టిల్ లీక్ అయినప్పటికీ, మేకర్స్ పూర్తి లుక్‌ను అధికారికంగా విడుదల చేయాలనే భావనలో ఉన్నారు.
ఎన్టీఆర్ పుట్టినరోజు మేలో ఉండటంతో అప్పటివరకు ఆగకుండా ముందు ఒక పోస్టర్‌ను విడుదల చేసి సినిమాపై హైప్ పెంచాలని దర్శకుడు అయాన్ ముఖర్జీ భావిస్తున్నాడని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించి రెండు టీజర్‌లు విడుదల చేయబోతున్నారని, అందులో ఒకటి ప్రత్యేకంగా ఎన్టీఆర్ పాత్రపై దృష్టి పెడతారని టాక్. తెలుగులో ‘దేవర’ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ఇదే కావడంతో టాలీవుడ్‌లో కూడా ఈ సినిమాపై విపరీతమైన ఆసక్తి నెలకొంది.
బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకుల్లోనూ ‘వార్ 2’పై భారీ అంచనాలు ఉండటంతో, ఈ సినిమా విడుదల పెద్ద ఎత్తున జరగనుంది. ఇదే సమయంలో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ కూడా సిద్ధమవుతోంది. ఈ నెలలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని వార్తలు వస్తున్నాయి.