ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో చాలామంది సినీ నటులు రాజకీయం బాట పట్టారు. అప్పటికే కొంతమంది రాజకీయాల్లోకి ఇలా వచ్చి, అలా వెళ్లిపోయినవాళ్లున్నారు. అయితే ఎన్టీఆర్, తెలుగుదేశం వచ్చిన తర్వాత రాజకీయాల్లోకి తెలుగు నటులు చాలామంది వచ్చారు. అలా వచ్చినవారిలో కైకాల సత్యనారాయణ ఒకరు. ఆయన అలా రాజకీయాల్లోకి రావడమే కాదు.. ఏకంగా ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు కూడా. అలా ఆయన జీవితంలో సినిమా, రాజకీయాలు రెండూ ఉన్నాయి.
ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లోనే కైకాల ఎంపీ అవ్వలేదు. అయితే అయ్యింది మాత్రం తెలుగు దేశం నుండే. 1996లో ప్రత్యక్షరాజకీయాల్లో కైకాల పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ తరఫు నుండి 1996లో మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవరగ్ంలో పోటీ చేసి గెలుపొందారు కైకాల సత్యనారాయణ. అలా సినీ – రాజకీయం రెండింటిలోనూ తనదైన ముద్ర వేశారు కైకాల. అయితే ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ ఆయన ఎన్నికల్లో లేరు. ఇక కైకాల 800కుపైగా సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో దాదాపు 200మందికిపైగా దర్శకులతో ఆయన పని చేశారు. అలాగే రమా ఫిలిమ్స్ పేరిట ఓ చిత్ర నిర్మాణ సంస్థను కైకాల ప్రారంభించారు. ఆ బ్యానర్ మీద సత్యనారాయణ ‘గజదొంగ’, ‘ఇద్దరు దొంగలు’, ‘కొదమ సింహం’, ‘బంగారు కుటుంబం’, ‘ముద్దుల మొగుడు’ లాంటి అదిరిపోయే సినిమాలను నిర్మిచారు. ఈ క్రమంలో కొన్ని సినిమాలకు చిరంజీవి సహ నిర్మాతగా కూడా వ్యవహరించండం గమనార్హం. ‘కేజీయఫ్’ సినిమాలకు కైకాల సత్యనారాయణ సమర్పకుడు.
‘కేజీయఫ్ 1’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆయన హాజరయ్యారు కూడా. ఆ తర్వాత పెద్దగా పబ్లిక్ అప్పీయరెన్స్ లేదు. బిరుదుల విషయానికొస్తే.. అభిమానులు, కళా సంస్థలు సత్యనారాయణ నటనకు చాలా బిరుదులు ఇచ్చాయి. ‘కళా ప్రపూర్ణ’, ‘నవరస నటనా సార్వభౌమ’ ఇలా చాలా రకాల బిరుదులు ఆయనకు ఉన్నాయి. అవార్డుల విషయానికొస్తే.. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుండి సత్యనారాయణ గౌరవ డాక్టరేటు అందుకున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డుతో కైకాలను సత్కరించింది.