టాలీవుడ్ విషాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ ఫిబ్రవరి నెలలోనే కళాతపస్వి కె విశ్వనాథ్ గారు వయసు సంబంధిత సమస్యలతో మరణించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 2 న ఆయన మరణించడం జరిగింది. అంతటి గొప్ప దర్శకుడు, నటుడు మరణవార్త విని టాలీవుడ్ మొత్తం షాక్ కు గురైంది.ఆ షాక్ నుండీ టాలీవుడ్ కోలుకోక ముందే నందమూరి తారకరత్న కూడా మరణించడం జరిగింది. నిండా 40 ఏళ్ళు కూడా లేని తారకరత్న సైతం మరణించడంతో నందమూరి అభిమానులతో పాటు సామాన్యులు సైతం ఎంతో బాధపడ్డారు. ఫిబ్రవరి 18 న తారకరత్న మరణించారు.
ఇక తాజాగా విశ్వనాథ్ గారి భార్య కాశీనాధుని జయలక్ష్మి కూడా కొద్దిసేపటి క్రితమే మరణించారు.విశ్వనాథ్ గారు మరణించిన టైంలో కూడా ఈమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. తర్వాత పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో చేర్చి చికిత్స అందిస్తూ వచ్చారు కుటుంబ సభ్యులు. కానీ చికిత్స పొందుతూనే ఆమె మరణించినట్లు తెలుస్తుంది. ఈరోజు సాయంత్రం 6 :15 నిమిషాల టైంలో జయలక్ష్మీ మరణించారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.
కె విశ్వనాథ్ గారు కన్ను మూసిన వార్డులోనే ఆయన భార్య జయలక్ష్మి కూడా మరణించినట్టు తెలిపి కన్నీరు మున్నీరు అయ్యారు కుటుంబ సభ్యులు. జయలక్ష్మీ గారి పార్దివ దేహాన్ని ఫిలింనగర్లో ఉన్న ఆమె నివాసానికి తరలించారు . కె.విశ్వనాథ్, జయలక్ష్మి …లకు ముగ్గురు సంతానం. అమ్మాయి పద్మావతి దేవి, అబ్బాయిలు కాశీనాథుని నాగేంద్రనాథ్, కాశీనాథుని రవీంద్రనాథ్.పెద్ద కుమారుడు అమెరికాలో ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత జయలక్ష్మీ అంత్యక్రియలు మొదలవుతాయని సమాచారం.