సౌత్ ఇండియన్ సినిమాలో ఇప్పుడు ‘హీరో’యిన్ అనే ట్యాగ్‌ను పొందిన హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్. ‘కొత్త లోక: చాప్టర్ 1’ సినిమాతో ఇటీవల వచ్చి ఎవరూ కలలో కూడా ఊహించని విజయాన్ని అందుకుందామె. ప్రముఖ హీరో దుల్కర్ సల్మాన్ ఈ సినిమాకు నిర్మాత అనే విషయం తెలిసిందే. అసలు ఆ సినిమాకు ఆయన ఎందుకు నిర్మాత అయ్యారు. ఇద్దరి మధ్య అనుబంధం ఏంటి? దీని వెనుక కారణం ఇప్పుడు తెలిసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కల్యాణినే ఈ విషయాలు చెప్పుకొచ్చింది.
‘హలో’, ‘చిత్రలహరి’, ‘రణరంగం’ సినిమాలతో ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కల్యాణి.. సూపర్ ఉమెన్ కథాంశంతో ‘కొత్త లోక’ సినిమాతో అదరగొట్టింది. కల్యాణి పుట్టింది కేరళ అయినా పెరిగిందంతా చెన్నైలోనే. తండ్రి ప్రియదర్శన్, తల్లి లిసా నటి కావడంతో చిన్నప్పుడు తరచూ సెట్స్‌కి వెళ్లేదట. అలా సినిమాలపై ఆసక్తి ఏర్పడిందట. కానీ, ప్రియదర్శన్ మాత్రం చదువు తర్వాతే ఏదైనా అన్నారట. అలా న్యూయార్క్ వెళ్లి ఆర్కిటెక్చర్ కోర్సు చేసింది. ఆ తర్వాతే ‘హలో’ చేసింది.
ఇక అసలు మేటర్‌కి వస్తే.. ఐదేళ్ల క్రితం వచ్చిన మలయాళ సినిమా ‘వరణే అవశ్యముంద్’లో దుల్కర్ సల్మాన్‌తో కలిసి నటించింది కల్యాణి. అప్పటి నుంచి ఇద్దరూ ఫ్రెండ్స్ అయిపోయారట. అప్పటి నుండి కష్టమొచ్చినా, సంతోషమొచ్చినా, ఏదైనా సలహా కావాలన్నా మొదటి ఫోన్ దుల్కర్ సల్మాన్‌కే చేస్తుందట. ఇక మోహన్‌లాల్ తనయుడు ప్రణవ్ చిన్ననాటి మిత్రులట. స్నేహితులమంతా కలసి ఓ సినిమా చేయాలని ఎప్పటి నుండో అనుకుంటే.. ‘హృదయం’తో నెరవేరిందని కల్యాణి చెప్పింది.
ఇదన్నమాట సంగతి.. తన స్నేహితురాలి కోసం దుల్కర్ సల్మాన్ ఆ సినిమాను నిర్మించాడు. ఏదైతేముంది ఇప్పుడు ఆ సినిమా విజయం ఇద్దరికీ మంచి పేరు తెచ్చిపెట్టింది. నటుడిగా మంచి మంచి సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్న దుల్కర్ ఈ సినిమాతో అభిరుచి ఉన్న నిర్మాతగా కూడా పేరు సంపాదించాడు. ఇప్పుడు ‘కొత్త లోక’ సిరీస్‌లో వరుస సినిమాలు రానున్నాయి.