లోకనాయకుడు కమల్ హాసన్‌కు దూకుడు ఎక్కువ… ఇందులో కొత్తేముంది ఆయన సినిమాలు చూస్తే ఎవరైనా చెప్పేస్తారు అంటారా? అదీ నిజమే. అయితే ఇప్పుడు దూకుడు ప్రదర్శిస్తోంది నటనలోనే, సినిమాల ఎంపికలోనో కాదు,. నిర్మాతగా. అవును రాజ్‌కమల్ బ్యానర్‌పై కమల్‌హాసన్ వరుస సినిమాలను అనౌన్స్ చేస్తున్నారు. తన బ్యానర్‌లో తాను నటించడమే కాకుండా, యువ హీరోలతో కూడా సినిమాలు చేయడానికి సిద్ధపడుతున్నారు. అలా తాజాగా శివకార్తికేయన్‌తో ఓ సినిమా తీస్తున్నాడు. రాజకీయాల్లోకి వెళ్లి కమల్ హాసన్ కొద్ది రోజులు సినిమాలకు దూరమయ్యారు.
అక్కడ ఘోర పరాజయం తర్వాత ఇప్పుడు తిరిగి సినిమాల మీద పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగానే వరుస సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారు. నటుడిగానే కాకుండా, నిర్మాతగా కూడా బిజీ అయ్యే ఉద్దేశాల్లో కమల్ ఉన్నారని అర్థమవుతోంది. అందుకే మూడు సినిమాలు లైనప్‌లో పెట్టుకున్నాడు. మరోవైపు నిర్మాతగా కూడా వరుస సినిమాలు ఓకే చేసి అనౌన్స్ చేసేస్తున్నాడు కమల్ హాసన్. సంక్రాంతి సమందర్భంగా కమల్ హాసన్ సొంత ప్రొడక్షన్ హౌస్ రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ ఓ ప్రకటన విడుదల చేసింది.
శివ కార్తికేయన హీరోగా ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సినిమాకు పెరియస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను కమల్ సోనీ పిక్చర్స్‌తో కలసి ప్రొడ్యూస్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా మొదలవుతుందని సమాచారం. అలాగే బిగ్‌బాస్ షోలో కూడా ఈ సినిమాను ఘనంగా అనౌన్స్ చేశారు. ఈ సినిమా కాకుండా కమల్ బ్యానర్‌పై మరికొన్నిసినిమాలు సిద్ధం చేస్తున్నారట. కమల్ – లోకేశ్ కనగరాజ్ కాంబోలో రూపొందుతున్న సినిమాను కూడా రాజ్‌కమల్ సంస్థే నిర్మిస్తోంది. ఇది కాకకుండా కమల్ ఓ ఆంథాలజీని తీయాలని చూస్తున్నారు.
మలయాళంలో వాసుదేవన్ నాయర్ రాసిన ఆరు షార్ట్ స్టోరీస్ ఆధారంగా ఈ ఆంథాలజీ ఉంటుందట. అంతేకాదు ఒక్కో కథను ఒక్కో దర్శకుడు డైరెక్ట్ చేస్తారట. కానీ స్క్రిప్ట్ వర్క్ మొత్తం కమలే చూసుకుంటారట. ఇందులో మలయాళ స్టార్ హీరోలను నటింపజేసే ఉద్దేశం ఉందట. దీని కోసం మోహన్‌లాల్, మమ్ముట్టి, ఫహద్ ఫాజిల్‌ను ఇప్పటికే సంప్రదించారనే టాక్ కూడా ఉంది. ఈ ఆంథాలజీని అన్ని భాషల్లోకి డబ్ చేసి విడుదల చేస్తారని సమాచారం. అన్నట్లు ఈ ఆరు కథలను లిజో జోస్, ప్రియదర్శన్, జయరాజ్, శ్యామ్ ప్రసాద్, సంతోష్ శివన్, సంతోష్ నారాయణన్ తెరకెక్కిస్తారని టాక్.