తెలుగులో, హిందీలో అంచనాలకు అందని స్థాయిలో పుష్ప ది రైజ్ సక్సెస్ సాధించింది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత బాలీవుడ్ సినిమాలు భారీస్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకునే విషయంలో ఫెయిల్ అవుతుంటే పుష్ప ది రైజ్ మాత్రం ఊహించని స్థాయిలో కలెక్షన్లను సాధించింది. బాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం పుష్ప సినిమాను ప్రశంసించిన సంగతి తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ పుష్ప సక్సెస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
గతంలో అనేక వివాదాల ద్వారా వార్తల్లో చిక్కుకున్న కమల్ ఆర్ ఖాన్ బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలపై చాలా సందర్భాల్లో సెన్సేషనల్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తాజాగా కేఆర్‌కే అని పిలవబడే కమల్ ఆర్ ఖాన్ పుష్ప సినిమా హిందీలో 100 కోట్ల రూపాయల బిజినెస్ చేసిందని ఊహించని స్థాయిలో ఘనవిజయాన్ని సొంతం చేసుకున్న బన్నీకి కంగ్రాట్స్ అని చెప్పుకొచ్చారు. బాలీవుడ్ స్టార్స్ కు పుష్ప సక్సెస్ చెంపపెట్టు అని కమల్ ఆర్ ఖాన్ అన్నారు.
బాలీవుడ్ లో స్టార్ హీరోలుగా చలామణి అవుతున్న వాళ్లు తమ సినిమాలతో 25 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించడానికి ఇబ్బంది పడుతున్నారని కానీ డబ్బింగ్ సినిమా అయిన పుష్ప మాత్రం 100 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించిందని కమల్ ఆర్ ఖాన్ చెప్పుకొచ్చారు. బాలీవుడ్ ఇండస్ట్రీ అంటే జనాలకు నచ్చడం లేదని ఇది చూస్తే అర్థమవుతోందంటూ కమల్ ఆర్ ఖాన్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. పుష్ప హిందీ హక్కులను కొనుగోలు చేసిన మనీష్ కు ఆ సినిమా బంగారు గనిలా మారిందని కమల్ ఆర్ ఖాన్ చెప్పుకొచ్చారు.
పుష్ప ది రూల్ హక్కులు కూడా మనీష్ దగ్గర ఉన్నాయని సమాచారం. ఈ సినిమా ఏకంగా 500 కోట్ల రూపాయల కలెక్షన్లను హిందీలో సాధిస్తుందని అంచనాలు ఉన్నాయి. ఆ స్థాయిలో ఈ సినిమా కలెక్షన్లను సాధిస్తుందో లేదో చూడాల్సి ఉంది. ఈ ఏడాదే పుష్ప ది రూల్ రిలీజ్ కానుంది.