మహారాష్ట్ర ప్రభుత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది స్టార్ హీరోయిన్ కంగనా. తాజాగా మరోసారి ఆమె ముంబై గవర్నమెంట్ పై విరుచుకుపడింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం తనను పరోక్షంగా వేధిస్తోందని చెప్పింది. ఇటీవల పాస్ పోర్ట్ విషయంలో కంగనా చేదు అనుభవాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె సోషల్ మీడియా వేదికగా.. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ సంచలన కామెంట్స్ చేసింది. ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి తనపై పెట్టిన కేసు కారణంగా తన పాస్ పోర్ట్ రెన్యూవల్ ను అధికారులు తిరస్కరించారని చెప్పింది.
ఈ విషయంపై హైకోర్టుకు వెళ్తే.. తన అప్లికేషన్ అస్పష్టంగా ఉందని పేర్కొంటూ జూన్ 25కి విచారణ వాయిదా వేసిందని చెప్పింది. అంతేకాకుండా.. భారత ప్రభుత్వాన్ని దూషిస్తూ కొన్నేళ్ల క్రితం అమీర్ ఖాన్ ఆరోపణలుచేస్తే .. అతని పాస్ పోర్ట్ ను నిలిపివేయలేదని.. అతడి సినిమా షూటింగ్స్ కి ఆటంకం కలగనివ్వలేదని. తనను మాత్రం వేధిస్తున్నారని చెప్పుకొచ్చింది. కంగనా నటిస్తున్న ‘తేజస్’ సినిమా షూటింగ్ కోసం హంగేరిలోని బుడాపెస్ట్‌కు వెళ్లాల్సి ఉంది.
ఈ క్రమంలో ఆమె ముంబైలోని పాస్ పోర్ట్ కేంద్రానికి వెళ్లింది. రెన్యూవల్ కి పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి. అయితే.. బాంద్రా పోలీస్ స్టేషన్ కి ఆమెపై దేశద్రోగం కేసు నమోదై ఉండడంతో అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కంగనా హైకోర్టుని ఆశ్రయించింది. ఇన్నాళ్లు ఆమె కోర్టుని ఎందుకు సంప్రదించలేదని ప్రశ్నించింది. దీంతో కంగనా ప్రభుత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.