కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) ప్రధాన పాత్రలో వస్తున్న ‘కంగువా’ (Kanguva) సినిమా మీద విడుదలకు ముందే కొన్ని ఆంక్షలు వచ్చాయి. ఈ టైమ్ ట్రావెల్ ఫాంటసీ యాక్షన్ చిత్రాన్ని నవంబర్ రెండో వారంలో విడుదల చేయాలనే ప్లాన్ తో యూవీ క్రియేషన్స్ మరియు స్టూడియో గ్రీన్ సంస్థలు ముందుకు వచ్చాయి. అయితే, అంబానీ సంస్థల్లో భాగమైన ప్రముఖ రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ కంగువా విడుదలను అడ్డుకోవాలని మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది.
Kanguva
స్టూడియో గ్రీన్ నిర్మాణ సంస్థ వారు తాము ఇచ్చిన రుణం మొత్తాన్ని పూర్తిగా చెల్లించకపోవడం వల్లే ఈ చర్య చేపట్టామంటూ రిలయన్స్ సంస్థ ఆరోపిస్తోంది. వివరాల్లోకి వెళ్తే, స్టూడియో గ్రీన్ అధినేత కేఈ జ్ఞానవేల్ రాజా (K. E. Gnanavel Raja) రిలయన్స్ సంస్థ నుంచి టెడ్డీ-2 (Buddy) , ఎక్స్ మీట్స్ ఓయ్, తంగలాన్ (Thangalaan) వంటి పలు చిత్రాల నిర్మాణానికి రూ.99 కోట్లకు పైగా రుణం తీసుకున్నట్లు సమాచారం.
ఈ మొత్తం నుండి ఇప్పటివరకు రూ.45 కోట్లు మాత్రమే తిరిగి చెల్లించారని, ఇంకా రూ.55 కోట్లు తిరిగి ఇవ్వలేదని రిలయన్స్ వారు పేర్కొంటున్నారు. అందుకే, తమకు రావాల్సిన మొత్తాన్ని మిగిలినంత వరకూ కంగువా విడుదలను నిలిపివేయాలని కోర్టును కోరారు. తమకు కొంత సమయం ఇవ్వాలని స్టూడియో గ్రీన్ కోర్టును అభ్యర్థించింది. నవంబర్ 7వ తేదీ వరకు కేసును వాయిదా వేయాలని కోరుతూ, ఆ తేదీ లోపు తన పరిష్కారం సాధించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పింది.
కోర్టు ఈ అభ్యర్థనను ఆమోదించి, నవంబర్ 7వ తేదీకి కేసును వాయిదా వేసింది. ఇప్పటికే నవంబర్ 14న కంగువాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో స్టూడియో గ్రీన్ ప్రమోషన్స్ మొదలు పెట్టింది. కానీ రిలయన్స్ సంస్థ కోర్టు మెట్లెక్కడంతో సినిమాపై సందిగ్ధం నెలకొంది. ఒకవేళ నవంబర్ 7లోపు ఎటువంటి పరిష్కారం రాకపోతే, కంగువా విడుదల తేదీ పై ప్రభావం పడే అవకాశం ఉంది.