ఎన్ననుకున్నా కోలీవుడ్ ఎప్పటికప్పుడు కొత్త కథలకై అన్వేషిస్తూనే ఉంటుంది. అందుకు తగ్గితే అక్కడి కథానాయకులు కూడా ఓ వైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోవైపు విభిన్నమైన చిత్రాలతో తెరమీదికొస్తుంటారు. కార్తీకి ఆ తరహా కథలలో తనని తాను చూసుకోవాలని తపిస్తున్నాడు. అన్న సూర్య లాంటి హీరో ఇంట్లోనే ఉండటంతో ఆ ప్రభావం ఇంకాస్త ఎక్కువే ఉంటుంది. కెరీర్ తొలినాళ్లలోనే ‘యుగానికి ఒక్కడు’ వంటి సినిమాలతో తన అభిరుచి చాటిన కార్తీకి ఆ సినిమా తగిన ఫలితం ఇవ్వకపోవడంతో కొన్నాళ్ళు ఆ ప్రయత్నాలు చేయడమే మానేశాడు. మళ్ళీ ఇన్నాళ్లకు కాష్మోరాతో తన అభిరుచికి తగ్గ సినిమా చేసిన కార్తీ ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడ్డాడట.
500 ఏళ్ళ క్రితం జరిగే చారిత్రిక నేపథ్యం గల సినిమా కావడంతో గుర్రపు స్వారీ నేర్చుకున్న కార్తీ రాజ్ నాయక్ పాత్ర కోసం గుండు చేయించుకోడానికి కూడా వెనుకాడలేదు. దర్శకుడు గోకుల్ మేకప్ తో కానిచ్చేద్దామన్నా సహజత్వం కోసం గుండు చేయించుకున్నాడు. పైగా ఈ పాత్ర మేకప్ కోసమే రోజుకి అయిదు గంటల సమయం పట్టేదన్న కార్తీ ఈ సినిమా కోసం పడ్డ కష్టం అంతా ఇంతా కాదని తన గోడు వెల్లబోసుకున్నాడు. ఓ పదేళ్ల తర్వాత చేయాల్సిన సినిమా ఇదని ఖచ్చితంగా తన కెరీర్లో ఓ మైలురాయి లాంటి సినిమా అవుతుందన్న నమ్మకం వ్యక్తం చేశాడు.
కార్తీ తోపాటు చిత్ర బృందం కూడా ఈ సినిమా కోసం తీవ్రంగా శ్రమించారు. దర్శకుడు ప్రీ ప్రొడక్షన్ పనుల కోసమే రెండేళ్లు కేటాయించారట. 90 నిమిషాల పాటు గ్రాఫిక్స్ తో కూడిన సన్నివేశాలు ఉన్న ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ పరంగా అరుంధతి, మగధీర చిత్రాల సరసన నిలుస్తుందని దర్శకనిర్మతలు భావిస్తున్నారు. కార్తీ కెరీర్లో అత్యధికంగా 60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రేపు (అక్టోబర్ 28న) 2000 థియేటర్లలో విడుదల కానుండగా అందులో తెలుగు రాష్ట్రాల్లనే 600 థియేటర్లు ఉండడం గమనార్హం. ఇన్ని చెబుతున్నా కథ విషయంలో మాత్రం గోప్యంగా వ్యవహరిస్తున్నారు. 500 ఏళ్ళ క్రితం ఉన్న రాజ్ నాయక్ కి, ఇప్పుడు ఉన్న కాష్మోరాకి గల సంబంధం ఏమిటన్నదే ప్రధానాంశంగా తెలియవస్తోంది. నయనతార, శ్రీదివ్య నటన ఆకట్టుకుంటుందని అంటున్న నిర్మాతలు హిస్టరీ, ఫాంటసీ, సందేశం, వినోదం కలగలిపిన సినిమాగా కాష్మోరా గురించి చెబుతున్నారో. విడుదలయ్యాక ప్రేక్షకులు ఏమంటారో మరి..!