తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ సినీ రచయిత కరుణానిధి అనారోగ్యంతో బాధపడుతూ నిన్న (మంగళవారం) సాయంత్రం కన్నుమూశారు. దాంతో తమిళనాడు శోకసంద్రంలో మునిగిపోయింది. నిత్యం రాజకీయలతో బిజీగా ఉంటూనే అతను సినీ రంగంలోనూ రాణించారు. అతని సినీ పయనాన్ని గుర్తుచేసుకుంటే… ప్రముఖ చలనచిత్ర నిర్మాణ సంస్థ “జూపిటర్ పిక్చర్స్” నుంచి పిలుపు రావడంతో అందులో స్క్రిప్ట్ రైటర్‌గా కొత్త జీవితాన్ని కరుణానిధి ప్రారంభించారు. ఆయన 39 సినిమాలకు స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేశారు. కరుణానిధి తొలిసారిగా 1947లో “రాజకుమారి” అనే చిత్రానికి సంభాషణలు రాశారు. ఇది ఎంజీఆర్ ప్రధాన పాత్రలో నటించిన తొలి సినిమా. ఎంజీఆర్ కెరీర్ కి ఈ చిత్రం ఎంతో దోహదపడింది. తర్వాత “అభిమన్యు” చిత్రానికి కరుణానిధి మాటలు రాశారు.
1952లో వచ్చిన “పరాశక్తి” సినిమాతో స్క్రిప్ట్ రైటర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ సినిమా నటుడు శివాజీ గణేశన్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత “మనోహర”తో కరుణానిధి పేరు దక్షిణాదిన అన్ని పరిశ్రమల్లో వినిపించింది. అందుకే కరుణానిధిని తెలుగు చిత్ర పరిశ్రమ ఆహ్వానించింది. ఇక్కడి సినిమా ఫంక్షన్ కు పిలిస్తే, తప్పకుండా అయన హాజరయ్యేవారు. రామానాయుడు నిర్మించిన “ప్రేమనగర్” సినిమా వంద రోజుల వేడుకకు కరుణానిధి హాజరై… నటీనటులు, సాంకేతిక నిపుణులకు జ్ఞాపికలు అందించారు. దాసరి దర్శకత్వం వహించిన “నీడ” చిత్ర శతదినోత్సవానికి కూడా కరుణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతేకాదు సూపర్ స్టార్ కృష్ణ నటించిన “అమ్మాయి మొగుడు-మామకు యముడు” సినిమాకు ఆయన స్క్రీన్ ప్లే రాశారు. ఈ సినిమా తెలుగువారిని ఆకట్టుకుంది. ఇలా కరుణానిధికి టాలీవుడ్ తో మంచి అనుబంధం ఉంది.