‘కొమ్మా ఉయ్యాల కోన జంపాల…’ అనే పాటతో ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా మొదలవుతుంది. సినిమా కథ అంతా ఆ పాటతోనే నడుస్తుంది అని చెప్పొచ్చు. ఆ పాట నచ్చి, పిల్ల పనితనం నచ్చి ఇంగ్లిష్ రాణి అ అమ్మాయిని తీసుకెళ్లిపోతుంది. ఆ తర్వాత అసలు స్టోరీ మొదలవుతుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ పాట గురించే మాట్లాడుకుంటున్నారు. రీల్స్, షార్ట్స్… ఇలా ఏదైనా ఆ పాట సందడే కనిపిస్తోంది. అలాంటి పాట ఫుల్ వెర్షన్ త్వరలో రాబోతోంది.
ఈ సినిమా సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ఈ విషయాన్ని చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. సినిమా నేపథ్య సంగీతానికి వస్తున్న ఆదరణ చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఆర్‌ఆర్‌ఆర్ బీజీఎంను అందరూ మెచ్చుకుంటున్నారు. వారందరి కోసం గుడ్ న్యూస్. త్వరలో బీజీఎం ఓఎస్‌టీని విడుదల చేస్తాం. ఈ విషయంలో ఆలస్యం చేసేది లేదు అంటూ ట్వీటారు కీరవాణి. దీంతోపాటు గ్రామంలో మల్లిపాడిన పాట ఫుల్ వెర్షన్‌ను కూడా విడుదల చేస్తామని చెప్పకొచ్చారు కీరవాణి.
అయితే ఇందులో అదే ట్యూన్‌కి తారక్ పాడే పాట ఉంటుందా లేదా అనేది చెప్పలేదు. మల్లి పెద్ద బంగ్లాలో ఉన్నప్పడు ఊరడించడానికి తారక్ అలియాస్ భీమ్ పాట పాడే విషయం తెలిసిందే. దీంతోపాటు సినిమాలో కీలక సమయాల్లో కొన్ని హమ్మింగ్స్, బీజీఎంలు అదిరిపోయాయి. వాటన్నింటికి ఒక దగ్గర చేసి విడుదల చేస్తారన్నమాట. ఇక ఈ సినిమా గురించి చూస్తే సుమారు రూ. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాకు దేశవ్యాప్తంగా మంచి వసూళ్లతో దూసుకుపోతోంది.
త్వరలో రూ. వెయ్యి కోట్ల పోస్టర్ చూస్తామని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. రామ్‌చరణ్, తారక్ పాత్రలకు మంచి స్పందన వస్తోంది. ఇటీవల ఈ విజయాన్ని పురస్కరించుకుని దిల్ రాజు పార్టీ కూడా ఇచ్చారు. అక్కడ ముందుగా ఇచ్చిన మాట ప్రకారం.. అనిల్ రావిపూడితో కలసి రాజమౌళి నాటు నాటు పాటకు స్టెప్పులేసిన విషయం తెలిసిందే.