‘బిగ్ బాస్3’ అతి త్వరలో ప్రారంభం కానుంది. మొదటి సీజన్ ఎన్టీఆర్ హోస్ట్ చేసి సూపర్ హిట్ చేసాడు. రెండో సీజన్ ఆ స్థాయిలో కాకపోయినా.. హిట్టయితే చేసాడు హోస్ట్ నాని. ఇక మూడో సీజన్ ను నాగార్జున హోస్ట్ చేయనున్నాడు. మరి నాగ్ ఎలా మెప్పిస్తాడా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. తెలుగులో ‘బిగ్ బాస్’ మొదలయ్యాక.. అంటే మొదటి రెండు సీజన్లు మొదలయ్యాక కొన్ని వివాదాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇంకా మూడో సీజన్ మొదలవ్వకుండానే వివాదాలు ఓ రేంజ్లో చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ‘బిగ్ బాస్’ లో క్యాస్టింగ్ కౌచ్ ఉందంటూ ‘ఫిదా’ ఫేమ్ గాయత్రి గుప్తా, సీనియర్ జర్నలిస్ట్ శ్వేతారెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కూడా ‘బిగ్ బాస్’ పై కేసు నమోదవ్వడం సంచలనంగా మారింది. ఇప్పుడు ప్రముఖ సినీ దర్శకనిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజాన్ని వేశాడు. సినిమాలానే ‘బిగ్ బాస్’ ప్రతి ఎపిసోడ్ ను సెన్సార్ చేయాలంటూ పిటిషన్ వేశాడు. రాత్రి 11 గంటల తర్వాతే ఈ షో ని ప్రసారం చేసేలా ఆదేశించాలంటూ కోరాడు. నాగార్జునతో సహా 10 మందిని ప్రతివాదులుగా చేర్చాడు కేతిరెడ్డి. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ‘బిగ్ బాస్’ టీమ్ కూడా హైకోర్టును ఆశ్రయించింది. బంజారాహిల్స్, రాయదుర్గం పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ వేశారు ‘బిగ్ బాస్’ యూనిట్ సభ్యులు. అయితే ‘బిగ్ బాస్’ ఫ్యాన్స్ అలాగే నాగార్జున ఫ్యాన్స్ మాత్రం.. సోషల్ మీడియాలో కేతిరెడ్డి పై విమర్శలు గుప్పిస్తున్నారు. ‘ ‘బిగ్ బాస్’ కి సెన్సార్ చేయడమేంట్రా.. నీ’ అంటూ అసభ్యకరమైన కామెంట్లు చేస్తూ రచ్చ చేస్తున్నారు.