ఓ కన్నడ సినిమాగా మొదలై… ఇప్పుడు దేశవ్యాప్తంగా తుపాను సృష్టిస్తున్న సినిమా ‘కేజీయఫ్’. రెండు భాగాలుగా రూపొందిన సినిమా ప్రస్తుతం రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. మొదటి భాగం కంటే రెండో భాగం భారీ విజయం అందుకుంది. భాష అనే భేదం లేకుండా అన్ని వుడ్స్‌లో అదరగొడుతోంది. ఇప్పుడు ‘కేజీయఫ్ 2’ విదేశాలకు పయనమవుతోందని సమాచారం. కొరియాలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. కొరియాలో ఉన్న భారతీయ సినిమాల ఫ్యాన్స్ అందరూ కలసి ‘కేజీయఫ్ 2’ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది.
ఈ మేరకు కొన్ని సోషల్ మీడియా పేజీల్లో ‘రాకీ భాయ్ తుఫాన్‌కి సిద్ధమవ్వండి.. కొరియా ఫ్యాన్స్’ అంటూ పోస్టులు కనిపిస్తున్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేస్తారని తెలుస్తోంది. ‘కొరియా… కమింగ్ సూన్ మే ఐ కమిన్’ అంటూ ‘కేజీయఫ్ 2’ పోస్టర్‌ను వైరల్ చేస్తున్నారు. అయితే… ‘కేజీయఫ్ 2’ కొరియా వెళ్తుందా? అనే విషయంలో అఫీషియల్ సమాచారం ఏమీ లేదు. ‘హోంబలే ఫిల్మ్స్’ నుండి త్వరలో దీనిపై క్లారిటీ వస్తుందని సమాచారం.
ఒక్క కొరియాలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా సినిమా రిలీజ్ చేసే అవకాశం ఉందట. మన దేశంలో సినిమా రన్ పూర్తయ్యాక మిగిలిన దేశాల గురించి ఆలోచిస్తారని అంటున్నారు. ఓటీటీ విడుదల విషయంలోనూ త్వరలోనే క్లారిటీ వస్తుంది అంటున్నారు. ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఓ రేంజ్‌లో టాక్ తెచ్చుకుంది. నైజాంలో రూ.40.10 cr, సీడెడ్‌లో రూ.10.61 cr, ఉత్తరాంధ్రలో రూ. 7.03 cr, ఈస్ట్‌లో రూ. 5.21 cr, వెస్ట్‌లో రూ.3.20 cr, గుంటూరు రూ.4.22 cr, కృష్ణాలో రూ.3.88 cr, నెల్లూరులో రూ.2.5 cr సాధించింది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.76.75 కోట్లు వసూలు చేసింది.