మార్చ్ 21కి వెల్లువలా విడుదలైన సినిమాల్లో ఒకటి “కిల్లర్ ఆర్టిస్ట్” (Killer Artiste). కొత్త దర్శకుడు, కొత్త నిర్మాత, కొత్త హీరో కలిసి రూపొందించిన ఈ చిత్రం మీద పెద్దగా అంచనాలు లేవు. మరి ఈ చిన్న సినిమా సర్ప్రైజ్ చేసిందా? లేక చిరాకుపెట్టిందా? అనేది చూద్దాం.!!
కథ: విక్కీ (సంతోష్ కల్వచెర్ల) ఓ సాదాసీదా కుర్రాడు. చిన్నప్పటినుండి ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న చెల్లెలు స్వాతి (స్వాతి మాధురి)ని ఓ సైకో దారుణంగా మానభంగం చేసి చంపడంతో ఎలాగైనా తన చెల్లెల్ని చంపిన సైకోని చంపడానికి ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో తన చెల్లెలి మరణానికి ఆ సైకో కారణం కాదని, మరో వ్యక్తి అని తెలిసి ఆశ్చర్యపోతాడు.
అసలు స్వాతిని చంపింది ఎవరు? మధ్యలో ఈ సైకో ఎందుకు వచ్చాడు? తన చెల్లెలి హంతకుడ్ని విక్కీ పట్టుకోగలిగాడా? అనేది “కిల్లర్ ఆర్టిస్ట్” (Killer Artiste) చూసి తెలుసుకోవాల్సిన విషయం.
నటీనటుల పనితీరు: సినిమా మొత్తానికి పాజిటివ్ పాయింట్స్ గా నిలిచిన ఏకైక నటుడు ప్రభాకర్. సైకోగా అతడు పాత్రను పోషించిన విధానం, ఆ సాడిజాన్ని పండించిన తీరు బాగుంది. చాన్నాళ్ల తర్వాత ప్రభాకర్ లోని నటుడ్ని, అతడి పర్సనాలిటీని, బాడీ లాంగ్వేజ్ ను సరైన స్థాయిలో వినియోగించుకున్న సినిమా ఇదే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరో నటుడు భద్రం వైవిధ్యమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఒక్క డైలాగ్ కూడా లేకపోయినా ఎక్స్ ప్రెషన్స్ తోనే అలరించాడు.
హీరోగా నటించిన విక్కీ స్క్రీన్ ప్రెజన్స్ బాగానే ఉన్నప్పటికీ.. నటుడిగా ఇంకా పరిణితి చెందాల్సి ఉంది. ముఖ్యంగా హావభావాల ప్రకటన విషయంలో చాలా డెవలప్ అవ్వాలి. మిగతా పాత్రల్లో నటించిన వారందరూ అలరించే ప్రయత్నం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు: చందు సినిమాటోగ్రఫీ & సురేష్ బొబ్బిలి సంగీతం సినిమాకి ఓ మోస్తరు ప్లస్ పాయింట్స్ గా నిలవగా.. సెట్ వర్క్, ప్రొడక్షన్ డిజైన్ మైనస్ గా మారాయి. దర్శకుడు రతన్ రిషి రాసుకున్న కథలోని కీలకమైన పాయింట్ బాగున్నప్పటికీ.. దాని చుట్టూ అల్లిన కథనం ఏమాత్రం అలరించలేకపోయింది. సైకో పాత్ర తీరును జస్టిఫై చేయడం కోసం రాసుకున్న హీరోయిన్ బర్త్ డే పార్టీ సీక్వెన్స్ మొత్తం వేస్ట్ అయ్యిందనే చెప్పాలి.
అన్నిటికీ మించి ఏదైతే కోర్ పాయింట్ ఉందో.. దాన్ని ఎలివేట్ చేయడం కోసం రాసుకున్న వినయ్ వర్మ పాత్ర అస్సలు పండలేదు. అందువల్ల.. దానిచుట్టూ అల్లిన కథ మొత్తం వృథా అయ్యింది. ఓవరాల్ గా దర్శకుడు రతన్ “కిల్లర్ ఆరిస్ట్”తో రంజింపజేయలేకపోయాడనే చెప్పాలి.
విశ్లేషణ: కీపాయింట్ తో కథలు నడవవు. అలరించే కథనం కూడా ఉండాలి. అందులోనూ ఈ తరహా థ్రిల్లర్స్ కు ట్విస్ట్ ను సస్టైన్ చేయడం అనేది చాలా కీలకం. ఆ విషయంలోనే దర్శకుడు విఫలమయ్యాడు. దాంతో.. “కిల్లర్ ఆర్టిస్ట్” చిత్రం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించిందే కానీ.. అలరించలేకపోయింది.
ఫోకస్ పాయింట్: శాడిస్టిక్ సినిమా!
రేటింగ్: 1/5