“హృదయకాలేయం” లాంటి హిలేరియస్ కమర్షియల్ హిట్ అనంతరం ఆ కాంబినేషన్ లో ఎప్పుడో నాలుగేళ్ల క్రితం మొదలై.. సినిమా కష్టాలు, ఆర్ధిక కష్టాలు వంటివి చవిచూసి ఎట్టకేలకు నేడు (ఆగస్టు 10) విడుదలవుతున్న చిత్రం “కొబ్బరిమట్ట”. సంపూర్ణేష్ బాబు హీరోగా త్రిపాత్రాభినయం పోషించిన ఈ చిత్రం ద్వారా రూపక్ రొనాల్డ్సన్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా.. “హృదయకాలేయం’ దర్శకుడు స్టీఫెన్ శంకర్ అలియాస్ సాయిరాజేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. మరి ఈ చిత్రబృందం అయిదేళ్లపాటు పడిన కష్టానికి, శ్రమకు తగిన ఫలితం లభించిందో లేదో చూద్దాం..!!
కథ: దువ్వలో నివసించే పాపారాయుడు (సంపూర్ణేష్ బాబు) ఎంతో ప్రేమగా తన ముగ్గురు భార్యలతో కలిసి కన్న ఆరవ సంతానం పెదరాయుడు (సంపూర్ణేష్ బాబు). చిన్నోడైనా.. తండ్రి పోలికలు ఉండడడంతో పేదరాయుడ్ని అందరూ అన్నయ్యలు, అక్కలు “అన్నయ్య/నాన్న”లా చూసుకొంటారు. తనకు ఏడుపొస్తే తమ్ముళ్లలాంటి అన్నయ్యలను కూడా ఏడిపిస్తూ, తనకి నవ్వొస్తే బలవంతంగా వాళ్ళని కూడా నవ్విస్తూ అదోరకంగా బ్రతుకుతున్న పెదరాయుడు & ఫ్యామిలీ లైఫ్ లోకి సడన్ ఎంట్రీ ఇస్తాడు ఆండ్రాయిడు (సంపూర్ణేష్ బాబు). తాను పాపారాయుడుకి పుట్టిన వాడినని, తనకు పెదరాయుడు & ఫ్యామిలీ ద్రోహం చేసిందని.. వాళ్లపై పగ తీర్చుకొంటానని శపధం చేస్తాడు.
అసలు ఆండ్రాయిడు అచ్చుగుద్దినట్లు పెదరాయుడులా ఎందుకున్నాడు? ఈ పగ వెనుక ఆంతర్యం ఏమిటి? చివరికి ఏం జరిగంది? అనేది “కొబ్బరిమట్ట” కథాంశం.
నటీనటుల పనితీరు: మూడు విభిన్న పాత్రల్లో సంపూర్ణేష్ బాబు నటన, వేరియేషన్స్ అదరగొట్టాడు. సినిమాకి చెప్పుకోదగ్గ ప్లస్ పాయింట్స్ లో సంపూ ముఖ్యుడు. సంపూ చేసే డ్యాన్సులు, ఫైట్లు చూసి ప్రేక్షకులు తప్పకుండా కడుపుబ్బ నవ్వుతారు.
ఇషికా సింగ్, గీతాంజలి, షకీలా పాత్రలు మన తెలుగు సినిమాలో సీనియర్ హీరోయిన్స్ & టీవీ సీరియల్ ఆర్టిస్టులను గుర్తు చేస్తాయి. వారి పాత్రల వాళ్ళ సినిమాకి కాస్త గ్లామర్ యాడ్ ఐయింది. మహేష్ కత్తి, గాయత్రి గుప్తా మరియు తమ్ముళ్లలాంటి అన్నయ్య పాత్రలు పోషించిన నటులు క్యారెక్టర్స్ కు న్యాయం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు: సంపూర్ణేష్ బాబు నటన తర్వాత సినిమాలో చెప్పుకోదగ్గ అంశాలు సాయి రాజేష్ రాసుకున్న కథ మరియు సయ్యద్ కమ్రాన్ సంగీతం. సాయి రాజేష్ కావాల్సినంత కామెడీ, సెటైర్స్ ను కథనంలో మిళితం చేసాడు. కమ్రాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో మంచి ఎలివేషన్స్ ఇచ్చాడు.
కెమెరా వర్క్ మరియు ఇతర సాంకేతికవర్గం పనితీరు ప్రొడక్షన్ వేల్యూస్ కి తగ్గట్లుగా ఉన్నాయి. ఒక చిన్న టీమ్ అయిదేళ్ల కష్టం వృధా పోలేదని చెప్పాలి.
దర్శకుడు రూపక్ నటీనటుల నుంచి మంచి నటన రాబట్టుకున్నాడు. స్లాప్ స్టిక్ కామెడీలో లాజిక్స్, సెన్సబిలిటీస్, కామన్ సెన్స్ వంటి వాటికి పని .లేకపోయినా. కొన్ని సన్నివేశాలు మరీ బోర్డర్ క్రాస్ చేసి సెన్స్ లెస్ గా అనిపిస్తాయి. అలాంటివి పక్కన పెడితే.. కేవలం 110 నిమిషాల ఈ “కొబ్బరిమట్ట” చిత్రాన్ని టైం పాస్ కోసం సరదాగా ఒకసారి చూడొచ్చు.
విశ్లేషణ: సంపూర్ణేష్ బాబు మీద బోలెడంత అభిమానం ఉండి, విడుదలైన ట్రైలర్లు, టీజర్లు, పాటలు చూసి సినిమా నుంచి ఏం ఆశించాలి అనే క్లారిటీ ఉన్నవాళ్లను ఆకట్టుకొనే చిత్రమిది. “హృదయ కాలేయం” రేంజ్ లో మాత్రం లేదనే చెప్పాలి. సంపూ డ్యాన్సుల కోసమైనా ఒకసారి చూడొచ్చు.