రవితేజ ఇప్పుడు కచ్చితంగా హిట్టు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలే 30 కోట్ల మార్కెట్ కాస్త 20 కోట్లకు పడిపోయింది. ఇక సినిమాలు వరుసగా ప్లాపులవుతుండడంతో బాక్సాఫీస్ వద్ద 10 కోట్ల షేర్ ను కూడా రాబట్టలేకపోతున్నాయి. ‘టచ్ చేసి చూడు’ ‘నేల టిక్కెట్’ ‘అమర్ అక్బర్ ఆంటోని’ .. ఇటీవల వచ్చిన ‘డిస్కో రాజా’ వంటి చిత్రాల పరిస్థితి సేమ్..! దీంతో ఎలాగైనా హిట్టు కొట్టాలని తనకి ‘డాన్ శీను’ ‘బలుపు’ వంటి రెండు హిట్లిచ్చిన గోపీచంద్ మలినేని తో ‘క్రాక్’ అనే చిత్రం చేస్తున్నాడు. శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ ఓ కీలక పాత్ర పోషిస్తుంది. ‘ఠాగూర్ మధు’ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 8న విడుదల కాబోతుంది. ఇక ఈరోజు మహా శివరాత్రి సందర్బంగా కొద్దిసేపటి క్రితమే టీజర్ ను విడుదల చేశారు.
‘ఒంగోలు లో రాత్రి 8 గంటలకి కరెంట్ పోయిందంటే.. కచ్చితంగా మర్డరే’ అనే డైలాగ్ తో టీజర్ మొదలైంది. అక్కడ జరిగే అన్యాయాల్ని అరికడుతూ.. రౌడీలకి హడలు తెప్పించే పోలీస్ ఆఫీసర్లా హీరో రవితేజ ఎంట్రీ ఉంది. విలన్ గా సముధ్రఖని కనిపిస్తున్నాడు. టీజర్ చూస్తుంటే ఎక్కడో తమిళ సినిమా ఫ్లేవర్ అనిపిస్తుంది. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. జి.కె.విష్ణు సినిమాటోగ్రఫీ ఆకట్టుకునేలా కనిపిస్తుంది. సినిమా పై అంచనాల్ని పెంచేంతలా అయితే టీజర్ లేదు. చివర్లో పోలీస్ అయిన హీరో ఓ విలన్ వేలు నరికేసిన విజువల్ చూస్తుంటే.. ‘క్రాక్’ అనే టైటిల్ కు జస్టిఫికేషన్ ఇవ్వాలనే దర్శకుడి తపన అర్థం చేసుకోవచ్చు. హిట్టు కొట్టడానికి ఏమాత్రం ఉంటే సరిపోదు. మీరు కూడా ఓ లుక్కెయ్యండి.