లాక్‌డౌన్‌కు కాస్త ముందు వచ్చి… ఓ ఊపు ఊపేసింది ఆహా. ఇంటర్నేషనల్ ఓటీటీలు రాజ్యమేలుతున్న తెలుగు నేలపై తనదైన ముద్ర వేసింది. కొత్త సినిమాలు విడుదల కావడం లేదు.. ఓటీటీలో ఏం తీసుకొస్తారో అనుకుంటుండగా… హిట్ తమిళ, మలయాళ సినిమాలు డబ్బింగ్ చేసి తెలుగులోకి తీసుకొచ్చింది. అలా తెచ్చిన సినిమాలన్నీ అదిరే లాభాలు ఇచ్చాయట. ఆ తర్వాత తెలుగులో తెరకెక్కిన చిన్న సినిమాలు తీసుకొచ్చారు. ఆ తర్వాత సమంత ‘సామ్ జామ్’ వచ్చింది. ఇప్పుడు సినిమాలు విడుదలవుతున్నాయి కదా. వాటి మీద దృష్టి సారించారు.
మొన్నటికిమొన్న నాగచైతన్య – సాయిపల్లవి ‘లవ్ స్టోరీ’ని చేజిక్కించుకున్న ‘ఆహా’… రెండో పెద్ద సినిమాను బ్యాగులో వేసేసుకుంది. ఈ సంక్రాంతి సీజన్‌కు తొలి సినిమాగా వచ్చిన ‘క్రాక్’ ఓటీటీ రైట్స్‌ను ఆహా దక్కించుకుందట. దీని కోసం ₹7 కోట్ల వరకు చెల్లించిందని సమాచారం. అంత డబ్బు పెట్టి అల్లు అరవింద్ క్యాష్ చేసుకుకోకుండా ఊరుకుంటాడా. అందుకే ఈ నెలాఖరుకే సినిమాలు స్ట్రీమ్ చేసేస్తున్నాడట. ఈ నెల 29నే సినిమా ‘ఆహా’లో చూసేయొచ్చట.
తీవ్ర ఆటుపోట్లు తర్వాత ‘క్రాక్’ మొన్న శనివారం విడుదలైన విషయం తెలిసిందే. ఉదయం షోతో ఆరంభమవుతుందన్న సినిమా ఆఖరికి రాత్రి 10.30 గంటలకు షోతో వచ్చింది. అయితే అంతసేపు ఓపికగా వేచి చూసిన అభిమానులకు ఫుల్ మాస్ మీల్స్ పెట్టి కడుపునింపి పంపించాడు మాస్ మహారాజ్. వసూళ్ల విషయంలోవ రవితేజ బాగానే రాణిస్తున్నాడట.