ఓ వెబ్ సిరీస్ కోసం దుబాయికి ఆడిషన్‌కు వెళ్లి డ్రగ్స్ కేసులో అరెస్టైన క్రిసాన్ పెరీరా విడుదలైంది. ఆమె జైలు నుండి బయటకు వచ్చాక తల్లితో మాట్లాడిన వీడియో కాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్రిసాన్ సోదరుడు కెవిన్ పెరీరా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఆ వీడియో చూసి నెటిజన్లు అయ్యో అనుకుంటున్నారు. క్రిసాన్ పెరీరా ‘సడక్ 2’, ‘బాట్లా హౌస్’ వంటి చిత్రాలతో బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. గంజాయి, గసగసాల చుట్టూ తిరిగిన ఈ వ్యవహారంలో ముంబయిలో వరుస అరెస్టులు కూడా జరిగాయి. ఇంతకీ ఏమైందంటే..
దుబాయిలో ఓ డ్రగ్స్ కేసులో అరెస్టైన బాలీవుడ్ నటి క్రిసాన్ పెరీరా బుధవారం జైలు నుండి విడుదలైంది. తప్పుడు కేసులో ఆమెను అరెస్టు చేసినట్లు తేలడంతో ఆమెను నిర్దోషిగా విడుదల చేశారు. క్రిసాన్‌ను ఏప్రిల్ 1న షార్జా విమానాశ్రయంలో అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. ఓ గిఫ్ట్ ప్యాక్ లాంటి దాంటిలో గంజాయి, గసగసాలను అక్రమంగా తరలిస్తున్నారన్న అభియోగాలపై ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుతో ఆమెకు ఎటువంటి సంబంధం లేదని ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇటీవల తేల్చారు.
పెంపుడు కుక్క విషయంలో జరిగిన గొడవకు ప్రతీకారంగా ఓ బేకరీ యజమాని(Actress) ఆమెను ఇరికించారని అధికారులు తేల్చారు. బేకరీ యజమాని ఆంథోనీ, నటి క్రిసాన్ ముంబయిలో ఒకే భవనంలో ఉంటున్నారు. పెంపుడు కుక్క విషయంలో ఆంథోనీ సోదరికి, క్రిసాన్ తల్లితో కొన్ని రోజుల క్రితం గొడవ జరిగింది. దీంతో క్రిసాన్‌పై కుట్ర పన్ని డ్రగ్స్ కేసులో ఇరికించాలని చూశాడు. ఇందులో భాగంగా టాలెంట్ కన్సల్టెంట్ రాజేష్ ద్వారా ఆంథోనీ ఉద్దేశపూర్వకంగానే క్రిసాన్‌ను షార్జాలో వెబ్ సిరీస్ కోసం ఆడిషన్‌కు రప్పించాడు.
ఆడిషన్‌లో పాల్గొన్నాక బహుమతిగా గంజాయి, గసగసాలు దాచిన ట్రోఫీని ఇచ్చి పంపించాడు. ఆ తర్వాత ఆమె డ్రగ్స్ తీసుకువెళుతున్నట్లు షార్జా విమానాశ్రయానికి సమాచారం అందించాడు. దీంతో విమానాశ్రయంలో పోలీసులు క్రిసాన్‌ను అరెస్టు చేశారు. ఈ కేసును దర్యాప్తు చేసిన ముంబయి పోలీసులు సంబంధిత పత్రాలను షార్జా పోలీసులకు పంపడంతో క్రిసాన్‌ను విడుదల చేశారు. ఆంథోనీ, రాజేష్ ఇదే తరహాలో గతంలో ఐదుగురిని మోసగించినట్లు పోలీసులు గుర్తించారు.