సుధాకర్ కొమాకుల, సుధీర్‌వర్మ, చాందిని చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కుందనపు బొమ్మ. ఎస్.ఎల్. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిరంజన్, అనిల్, వంశీ నిర్మించారు. ముళ్లపూడి వరా దర్శకత్వం వహించారు. కె. రాఘవేంద్రరావు సమర్పకుడు. మాగ్నస్ సినీప్రైమ్ పతాకంపై శ్రీనివాస్ బొగ్గరం ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ గ్రామీణ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథా చిత్రమిది. సున్నితమైన భావోద్వేగాల మేళవింపుతో ఆద్యంతం హృద్యంగా సాగుతుంది. శ్రీనివాస్ బొగ్గరం సినిమా చూసి బాగుందని తానే విడుదల చేస్తానని ముందుకువచ్చారు అని తెలిపారు. అనురాధ ఉమర్జీ మాట్లాడుతూ చక్కటి టీమ్‌వర్క్‌కు నిదర్శనంగా నిలిచే చిత్రమిది. యూనిట్ అంతా కుటుంబ సభ్యుల్లా కలిసిపోయి పనిచేశారు.
ఇలాంటి కుటుంబ కథా చిత్రాల్ని ఆదరిస్తేనే మరిన్ని మంచి సినిమాలు రూపొందుతాయి. బాపురమణల్ని గుర్తుకుతెచ్చే మంచి చిత్రమిది అని చెప్పారు. మనవైన అనుబంధాల్ని జ్ఞప్తికి తెస్తుందని, పల్లెటూరి వాతావరణాన్ని తలపిస్తూ ఆహ్లాదకరంగా ఉంటుందని సుధీర్‌వర్మ చెప్పారు. చక్కటి కథాబలమున్న చిత్రంలో టైటిల్ రోల్‌ను నటిస్తున్నందుకు గర్వపడుతున్నానని, కెరీర్ తొలినాళ్లలోనే అభినయానికి ఆస్కారమున్న పాత్రను పోషించే అవకాశం రావడం అదృష్టమని చాందినిచౌదరి చెప్పింది. మంచి సినిమా కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఇలాంటి గొప్ప సినిమా నటించే అవకాశం దొరికిందని, గత చిత్రాలకు పూర్తి భిన్నంగా నా పాత్ర వైవిధ్యంగా ఉంటుందని సుధాకర్ కొమాకుల పేర్కొన్నారు కుటుంబ విలువలతో కూడిన మంచి సినిమా ఇది.
బాపు రమణల వారసుడు వరా ముళ్లపూడి చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. కార్తికేయ తర్వాత మా బ్యానర్ నుంచి ఇలాంటి మంచి సినిమాను విడుదల చేస్తుండటం ఆనందంగా ఉంది. ఇటీవలే సినిమా చూశాను. బాగుంది. కథాబలమున్న ఇలాంటి చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకముంది. మంచి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడం బాధ్యతగా భావించి విడుదల చేస్తున్నాం అని శ్రీనివాస్ బొగ్గరం తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాతలు నిరంజన్, అనిల్, కెమెరామెన్ ఎస్.డి.జాన్, గౌతమ్‌కశ్యప్, వంశీ, శివ, అనిత తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం:ఎమ్.ఎమ్.కీరవాణి, సమర్పణ:కె. రాఘవేంద్రరావు, ఎడిటర్: జీవీ చంద్రశేఖర్, స్క్రీన్‌ప్లే, ముళ్లపూడి వరా, కె.కె. వంశీ, శివ తాల్లూరి, నిర్మాతలు: అనిల్, వంశీ, నిరంజన్, కథ, దర్శకత్వం: మూళ్లపూడి వర.