సాధారణంగా హీరోయిన్ల జీవిత కాలం చాలా తక్కువ. బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో కనీసం రెండు, మూడు దశాబ్ధాల పాటు హీరోయిన్లుగా ఏలినవారున్నారు. సావిత్రి, వాణిశ్రీ, జయప్రద, శ్రీదేవి, రేఖ, మాధురీ దీక్షిత్ వంటి వారు ఏళ్లకు ఏళ్లు వెండితెరపై మహారాణుల్లా వెలుగొందారు. ఫిజిక్, ఫేస్‌లో ఛార్మింగ్ వున్నంత వరకే హీరోయిన్‌గా ఛాన్సులు వస్తాయి. ఆ తర్వాత ఎవరికీ వారు గుర్తుండరు. అయితే హీరోల సంగతి అలా కాదు. ఏడు పదుల వయసులో కూడా హీరోలుగా చేసేవారున్నారు. కొందరు తాత, తండ్రి, మావయ్య వంటి పెద్దరికం వున్న పాత్రలు చేస్తూ వుంటారు.
అయితే తెలుగు తెరపై అగ్రనటులుగా వున్న ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజులు 60 ఏళ్లు నిండిన తర్వాత కూడా హీరోలుగా నటించారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి వారి టైం స్టార్ట్ అయిన తర్వాత సీనియర్ హీరోలంతా ఒకే ఏడాది తమ సినిమాలు రిలీజ్ చేసి సందడి చేశారు. అదే 1993వ సంవత్సరం. మోహన్ బాబు నిర్మాతగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన మేజర్ చంద్రకాంత్‌లో ఎన్టీఆర్ లీడ్ రోల్ పోషించారు. అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది.
ఇక తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ, ఆమని హీరో, హీరోయిన్లుగా నటించిన “పచ్చని సంసారం” సినిమా కూడా హిట్ అయ్యింది. ఇక ఆంధ్రుల సోగ్గాడు శోభన్ బాబు హీరోగా ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన “ఏవండీ ఆవిడ వచ్చింది” చిత్రం విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇక రెబల్ స్టార్ కృష్ణం రాజు విషయానికి వస్తే.. సుమన్, మాలశ్రీ జంటగా శరత్ దర్శకత్వంలో వచ్చిన ‘‘బావా బావమరిది’’ సైతం ఘన విజయం సాధించింది. అయితే 1993వ సంవత్సరం నటసామ్రాట్ ఏఎన్ఆర్‌కు కలిసి రాలేదు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి బి. గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘‘మెకానిక్ అల్లుడు’’ఘోర పరాజయం పాలైంది.