సెంటిమెంట్‌ని నమ్మని సినిమావాళ్లు ఉన్నారు అంటే.. ఏ కోటికొకరు అని చెప్పొచ్చు. ఎందుకంటే అంతలా నమ్ముతారు సెంటిమెంట్లను. అంతెందుకు ఇప్పుడు ‘ఆచార్య’ సినిమా పరాజయం కూడా ఇలాంటి ఓ సెంటిమెంట్ వల్లే అనేవారూ ఉన్నారు. దానికి తగ్గ రీజన్లు కూడా చెబుతున్నారు అనుకోండి. అయితే ఇప్పుడు మరో సెంటిమెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే ఎన్టీఆర్ – ‘ప్లాప్’ డైరక్టర్ల సెంటిమెంట్. ఇప్పటికి మూడుసార్లు వర్కౌట్ అయిన ఈ సెంటిమెంట్ నాలుగోసారి కూడా వర్కవుట్ అవుతుంది అని నమ్మకంగా చెబుతున్నారు.
ఇంతకీ ఏంటా సెంటిమెంట్ అనేగా మీ ప్రశ్న. ఎన్టీఆర్‌తో సినిమా చేసే దర్శకుడికి అంతకుముందు సినిమా ఫ్లాప్ అయి ఉండాలి. అవును ఒక హీరోకు ఫ్లాప్.. ఇంకా చెప్పాలంటే అట్టర్ ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడు ఆ తర్వాత సినిమాను తారక్‌తో చేస్తే ఆ సినిమా బంపర్ హిట్ అట. ఇప్పుడు ఈ మొత్తం కాన్సెప్ట్‌కి చెందిన మీమ్ వైరల్‌గా మారింది. ఇలా ఫ్లాప్ ఇచ్చి.. హిట్ కొట్టిన దర్శకుల్లో సుకుమార్, బాబీ, త్రివిక్రమ్, కొరటాల ఉన్నారు.
మహేష్‌బాబుతో ‘వన్ నేనొక్కడినే’ లాంటి డిజాస్టర్ ఇచ్చిన సుకుమార్ ఆ తర్వాత ఎన్టీఆర్‌కు ‘నాన్నకు ప్రేమతో’ లాంటి హిట్ సినిమా ఇచ్చారు. పవన్ కల్యాణ్‌తో ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ లాంటి దారుణమైన సినిమా చేసిన తర్వాత బాబీ.. తారక్‌తో ‘జై లవకుశ’ లాంటి విజయవంతమైన సినిమా ఇచ్చారు. ఇక పవన్ కల్యాణ్ కెరీర్‌లో డిజాస్టర్ సినిమా అయిన ‘అజ్ఞాతవాసి’ తర్వాతనే ఎన్టీఆర్‌తో ‘అరవింద సమేత’ సినిమా చేశారు త్రివిక్రమ్.
ఈ లెక్కన చిరంజీవి – రామ్‌చరణ్‌కు ‘ఆచార్య’ మిగిల్చిన చేదు ఫలితం… ఎన్టీఆర్‌కు మంచి విజయాన్ని అందిస్తుంది అని లెక్కలేసుకుంటున్నారు ఫ్యాన్స్. ఇప్పటివరకు తారక్ విషయంలో మూడుసార్లు పక్కాగా పని చేసిన ఈ లాజిక్ నాలుగోసారి కూడా పని చేస్తుంది అంటున్నారు. అయితే ఇక్కడో మరచిపోకూడని విషయం ఏంటంటే.. ఎన్టీఆర్‌కి ఇలా వచ్చిన విజయాలు కమర్షియల్‌గా అంతగా వర్కౌట్ కాలేదు అంటుంటారు. అంటే వసూళ్ల పరంగా చూస్తే ఆశించిన ఫలితం రాలేదు అని అర్థం.