రచయితగా సినీ రంగంలోకి పదం మోపినా అటుపై నటుడిగా మారి తెలుగు ప్రేక్షక లోకాన్ని అలరించారు ఎమ్.ఎస్.నారాయణ. మేకప్ వేసుకున్న పదిహేనేళ్లలోనే ఏడు వందలకు పైగా సినిమాలు చేశారంటే ఆయన ప్రతిభేమిటో అర్థం చేసుకోవచ్చు. అసలంతెందుకు తెలుగు సినిమాలో తాగుబోతు పాత్రంటే ఎవరికైనా ఠక్కున గుర్తొచ్చే పేరు ఎమ్మెస్ నారాయణ. అంతలా ఎమ్మెస్ చిత్ర పరిశ్రమలో రానిస్తే ఆయన వారసులు మాత్రం ఆ స్థాయిలో రాణించలేకపోయారు.
కొడుకు సినిమాతో హీరోగా మారిన ఎమ్మెస్ తనయుడు విక్రమ్ ఇప్పుడు చిన్న చితకా పాత్రలతో సరిపెట్టుకుంటుండగా కుమార్తె శశికిరణ్ దర్శకత్వ బాట పట్టారు. తొలి ప్రయత్నంగా చేసిన ‘సాహెబ సుబ్రహ్మణ్యం’ సరైన ఫలితాన్ని ఇవ్వలేదు. మలయాళ చిత్రం ‘తట్టతిన్ మరయత్తు’కు రీమేక్ గా రూపొందిన ఈ సినిమా 2014లో తెలుగులో విడుదలైంది. ఆ సినిమా ఫలితాన్ని లెక్కచేయకుండా ఇప్పుడు మరో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు శశికిరణ్. ఈసారి శశి సొంత కథనే ఎంచుకోగా ఇందులో తమిళ, తెలుగు భాషల్లో రాణిస్తున్న ఆది పినిశెట్టి హీరోగా నటించనున్నారట. తొలి సినిమా భీమిలి బ్యాక్ డ్రాప్ లో నడిపిన దర్శకురాలు ఈ సినిమా కోసం విశాఖపట్టణంను ఎంచుకున్నారట. త్వరలో సెట్స్ మీదికి వెళ్లనున్న ఈ సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.