మారి2

మూడేళ్ళ క్రితం వచ్చి ఫ్లాపైన “మారి” చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన చిత్రం “మారి 2”. ఫస్ట్ పార్ట్ లో కాజల్ క్లాస్ కథానాయికగా నటించగా.. సీక్వెల్ లో సాయిపల్లవి మాస్ హీరోయిన్ గా నటించింది. మరి మొదటి భాగంతో అలరించలేకపోయిన దర్శకుడు బాలాజీ మోహన్ కనీసం సెకండ్ పార్ట్ తో అయినా ఆకట్టుకోగలిగాడా? లేదా? అనేది సమీక్ష చదివి తెలుసుకోండి..!!

కథ : చావు భయం లేకపోవడంతోపాటు విపరీతమైన వెటకారం ఉన్న మాస్ రౌడీ మారి (ధనుష్). అందరూ మారికి భయపడితే.. మారి మాత్రం అదే ఏరియాలో ఆటో తోలుకునే ఆనంది (సాయి పల్లవి)కి భయపడుతుంటాడు.

మారి, జగన్ మంచి స్నేహితులు.. ఇద్దరూ కలిసి ఇల్లీగల్ దందాల జోలికిపోకుండా.. హ్యాపీగా సెటిల్ మెంట్లు, చిన్నపాటి స్మగ్లింగ్లు చేసుకొని బ్రతికేస్తుంటారు. వీళ్ళ లైఫ్ లోకి సడన్ ఎంట్రీ ఇస్తాడు బేజా (థామస్). అప్పటివరకూ సాఫీగా సాగుతున్న మారి జర్నీ.. బేజా ఎంట్రీతో కష్టాల్లో పడుతుంది.

ఒకానొక సందర్భంలో మారి ఊరు వదిలి వెళ్లిపోవాల్సి వస్తుంది. అయితే.. అతడ్ని తిరిగి రప్పిస్తుంది కలెక్టర్ (వరలక్ష్మీ శరత్ కుమార్). చాన్నాళ్లపాటు ఈ గొడవలకి దూరంగా ఉన్న మారి రీఎంట్రీ ఇచ్చాక పరిస్థితులు ఎలా మారిపోయాయి అనేది “మారి 2” కథాంశం.

నటీనటుల పనితీరు : నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయంలో వేలెత్తిచూపించడానికి ఎక్కడా ఆప్షన్ లేదు. కొంటె డాన్ గా ధనుష్, మాస్ లేడీగా సాయిపల్లవి, ఫ్రెండ్ పాత్రలో కృష్ణ, విలన్ గా థామస్, కలెక్టర్ గా వరలక్ష్మీ శరత్ కుమార్, హీరో ఫ్రెండ్స్ గా రోబో శంకర్ & కొ నటనతో పాత్రలకి ప్రాణం పోశారు.

ప్రతి ఒక్కరి పాత్ర సినిమాలో కీలకమే.. ఒకరు తక్కువ చేశారు, ఒకరు ఎక్కువగా నటించారు అని చెప్పలేం.

సాంకేతికవర్గం పనితీరు : మారి 1కి బిగ్గెస్ట్ ఎస్సెట్ అయిన అనిరుధ్ మ్యూజిక్ & బీజీయమ్ ఈ సినిమాలో మిస్ అయ్యాయి. యువన్ శంకర్ రాజా ఎంత ప్రయత్నించినా అనిరుధ్ మ్యాజిక్ ని మరిపించలేకపోయాడు. సినిమాటోగ్రఫీ వర్క్ మాస్ ఎలివేషన్ సీన్స్ లో పర్లేదు కానీ.. మిగతా సన్నివేశాల్లో మాత్రం చాలా స్లగ్గిష్ గా ఉంది. ఎడిట్ కట్స్ బాగున్నాయి.. లైటింగ్ & డి.ఐలోనూ చాలా తప్పులు దొర్లాయి.

దర్శకుడు బాలాజీ మోహన్ క్యారెక్టర్స్ ను డిఫరెంట్ గా పరిచయం చేయడంలో చూపిన శ్రద్ధ కథ-కథనం విషయంలో చూపలేదు. దాంతో సినిమా అంతా ఏదో పోతోంది అనిపిస్తుంది తప్పితే.. ఎక్కడా ఎగ్జైట్ మెంట్ మాత్రం ఉండదు. అయితే.. మారి కొడుకు క్యారెక్టర్ ను డిజన్ చేసిన విధానం మాత్రం బాగా ఆకట్టుకుంటుంది.

విశ్లేషణ : టిపికల్ క్యారెక్టర్స్, డిఫరెంట్ కామెడీ ఉన్న “మారి 2″లో సాయిపల్లవి నటన, క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రమే ఆకట్టుకొనే అంశాలు కావడంతో సినిమా కాస్త బోర్ కొట్టిస్తుంది. సో.. ఈ సీక్వెల్ కి కూడా మారి లాంటి రిజల్టే వచ్చింది.

రేటింగ్ : 1.5/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus