ప్రపంచంలో ప్రఖ్యాతగాంచిన వ్యక్తుల ప్రతిమలను ఒకేచోట ప్రతిష్టించే మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం వాళ్లు తొలిసారిగా తెలుగు సినీ పరిశ్రమకుచెందిన ప్రభాస్ ప్రతిమను ఏర్పాటుచేశారు. అతను నటించిన బాహుబలి చిత్రంలోని అమరేంద్ర బాహుబలి మైనపు విగ్రహాన్ని బ్యాకాంక్ మ్యూజియంలో ప్రతిష్టించారు. అలాగే త్వరలోనే మహేంద్ర బాహుబలి విగ్రహాన్ని ఏర్పాటుచేయనున్నారు. అయితే తొలిసారి మహేష్ ప్రతిమ(పాత్రకు సంబంధం లేకుండా)ను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారు. బ్రహ్మోత్సవం, స్పైడర్ చిత్రాల అపజయంతో కొంచెం వెనక్కి తగ్గిన మహేష్ భరత్ అనే నేను సినిమాతో సత్తా చాటారు. ఈ మూవీ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 45 దేశాల్లో రిలీజ్ అయి కలక్షన్ల వర్షం కురిపిస్తోంది. ముఖ్యమంత్రిగా మహేష్ నటనకు ఫిదా అవుతున్నారు.
ఈ సినిమాతో మహేష్ కున్న క్రేజ్ ని గమనించిన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం వారు మహేష్ ప్రతిమను ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకున్నారు. నిన్న హైదరాబాద్ కి వచ్చి మహేష్ శరీర కొలతలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ “ప్రతిష్టాత్మకమైన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో భాగమవడం సంతోషంగా ఉంది. భరత్ అనే నేను మూవీ విజయం ఆనందంలో ఉన్న నాకు ఈ విషయం రెట్టింపు సంతోషాన్ని ఇచ్చింది” అంటూ మహేష్ ట్వీట్ చేశారు.