టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు అందరు హీరోలు రాజమౌళి డైరెక్షన్ లో ఒక్క సినిమాలో అయినా నటించాలని భావిస్తారు. సినిమాలో ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉండేలా జాగ్రత్తలు తీసుకునే రాజమౌళి తన సినిమాల ద్వారా హీరోలకు పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపును వచ్చేలా చేస్తున్నారు. రాజమౌళి డైరెక్షన్ లో బాహుబలి సిరీస్ సినిమాలలో నటించిన తరువాత ప్రభాస్ మార్కెట్ ఊహించని స్థాయిలో పెరిగిన సంగతి తెలిసిందే.
ప్రభాస్ గత సినిమా సాహోకు ఫ్లాప్ టాక్ వచ్చినా పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ కు ఉన్న గుర్తింపు వల్లే ఆ సినిమా హిందీలో, ఇతర భాషల్లో రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించింది. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపును సొంతం చేసుకుంటామని జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ భావిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో ఒక సినిమా పట్టాలెక్కనుంది. ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న మహేష్ బాబు ఈ సినిమా తరువాత రాజమౌళి సినిమాలో నటిస్తారని మహేష్ ఫ్యాన్స్ భావించారు.
అయితే సర్కారు వారి పాట సినిమా తరువాత మహేష్ త్రివిక్రమ్ లేదా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో నటిస్తారని వార్తలు వస్తున్నాయి. . మరోవైపు రాజమౌళి జూన్ నాటికి ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ను పూర్తి చేయనున్నారు. కరోనా వల్ల ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఆలస్యం కావడంతో రాజమౌళి తన తరువాత సినిమా షూటింగ్ ను వేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది. మహేష్ రాజమౌళి సినిమాకు కాకుండా ఇతర సినిమాలకు ప్రాధాన్యతనిస్తే మాత్రం మహేష్ రాజమౌళి సినిమా ఆలస్యం కావడం లేదా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. రాజమౌళి సినిమాను ఆలస్యం చేసి తప్పు చేయొద్దని మహేష్ కు ఫ్యాన్స్ సూచిస్తున్నారు.