ఆ సినిమా థియేటర్లలో రిలీజ్ అవ్వడానికి చాలా రోజులు పట్టింది. ఇదిగో, అదిగో అంటూ చాలా రోజులు వాయిదా పడి ఎట్టకేలకు విడుదలై ఓకే ఓకే అనిపించుకుందా చిత్రం. అలా అని ఏదో చిన్న హీరో సినిమా అనడానికి లేదు. ఎందుకంటే వరుస విజయాలు, భారీ ఫ్యాన్ బేస్ ఉన్న హీరో సినిమా అది. అయితే అయిందేదో అయిపోయింది అనుకుని ఓటీటీకి సంబంధించిన పనులు చేసి త్వరగానే రిలీజ్ చేశారు. ఇప్పుడు సౌత్ లాంగ్వేజెస్‌కి కూడా తీసుకొచ్చారు. ఆ సినిమానే ‘మైదాన్’ (Maidaan) .
ఆ హీరోనే అజయ్ దేవగణ్(Ajay Devgn) . హైదరాబాద్‍కు చెందిన ప్రముఖ ఫుట్‍బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. అమిత్ శర్మ (Amit Ravindernath Sharma) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ప్రియమణి (Priyamani) కథానాయికగా నటించింది. ఏప్రిల్ 10న థియేటర్లలో వచ్చిన ఈ సినిమాను అక్కడికి నెలన్నరకే ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. మే 22 నుండి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా తెలుగు వెర్షన్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది.
అలాగే తమిళ, మలయాళ భాషల్లో కూడా సినిమాను వీక్షించొచ్చు. ఈ సినిమా తెలుగులో వస్తే చూడాలని చాలా రోజులుగా తెలుగు రాష్ట్రాల ప్రజలు అనుకుంటున్నారు. మన లెజెండరీ కోచ్ గురించి తెలుసుకోవచ్చు అనేది వారి ఆలోచన. ఇప్పుడు ఆ అవకాశం దక్కింది. 1950వ దశకంలో భారత ఫుట్‌బాల్ టీమ్ కోచ్‌గా రహీమ్ (అజయ్ దేవ్‌గణ్) నియమితుడవుతాడు. అప్పటికి ఆ ఆటలో బెంగాళీలదే ఆధిపత్యం. దీంతో కోచ్‌గా రహీమ్ వద్దంటూ కొంతమంది కుట్రలు పన్నుతారు.
ఈ క్రమంలో పదవి పోతుంది. ఆ సమస్యలను రహీమ్ ఎలా అధిగమించారు? అతని కోచింగ్‌లో భారత ఫుట్‌బాల్ టీమ్ ఏషియన్ గేమ్స్‌లో ఎలా పతకం గెలిచింది అనేదే ‘మైదాన్’ కథ. సినిమాలో అజయ్ దేవగణ్ పాత్ర చిత్రణ అదిరిపోతుంది అని చెప్పాలి. హృద్యమైన సన్నివేశాల్లో అజయ్ కన్నీళ్లు పెట్టించేశాడు. మరోవైపు ప్రియమణి కూడా తన పాత్రకు తగ్గ నటనను కనబర్చి మెప్పించింది.