ఊరికి దూరంగా హీరో ఏదో పని చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో ఊర్లో ఏదో సమస్య వస్తుంది. దాంతో ఉన్నఫళంగా సొంతూరికి వచ్చేసి, ఆ సమస్యను తీర్చేస్తాడు. ఈ క్రమంలో విలన్లతో ఎలా పోరాడాడు అనేదే సినిమా. ఏంటీ ఈ కథ ఏదో సినిమాలో చూసినట్లు ఉందా? ఒక సినిమాలో కాదు చాలా సినిమాల్లో చూసి ఉంటారు. ఇప్పుడు ఇదే కథను మరోసారి చూపించడానికి సిద్ధమవుతున్నారు మహేష్‌బాబు – పరశురాం. ఏంటీ… ‘సర్కారు వారి పాట’ కథ ఇదేనా? అని అడుగుతారా? మీరు అలా అడిగితే అవును అనే సమాధానమే చెప్పాలి వస్తుంది.
అయినా ఈ సినిమా కథ ఇదే అని, మేం చెప్పడం లేదు. బుక్ మై షో వెబ్‌సైట్‌లో ఇదే కనిపిస్తోంది. సినిమా విడుదలకు మరో రెండు నెలల ఉండటంతో ఆ వెబ్‌సైట్‌లో సినిమా గురించి ఓ పేజీ క్రియేట్ చేశారు. ఈ క్రమంలో సినిమా ప్లాట్‌ను రాసుకొచ్చారు. అందులోనే సినిమా గురించి ఈ వివరాలు రాసుకొచ్చారు. దీంతో మళ్లీ రొడ్డ కొట్టుడు కథే తీస్తున్నారా? అని ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు. ఇంకొందరు అయితే కాన్సెప్ట్ అదే అయినా, పరశురాం స్టైల్ ట్రీట్‌మెంట్ ఉంటుంది అని అంటున్నారు.
ఎలాంటి సినిమానైనా తనదైన కామెడీ టైమింగ్, ఎమోషన్స్‌తో కొత్త లెవల్‌లో చూపించగల దర్శకుడు పరశురాం. ఈ టాలెంట్ చూసే, పరశురామ్‌కి మహేష్‌బాబు ‘సర్కారు వారి పాట’ చేస్తున్నాడు అని టాక్ కూడా ఉంది. అయితే మళ్లీ చూసీ చూసి బోర్ కొట్టేసిన కథను మళ్లీ తీస్తారా అని మాత్రం అనుకుంటున్నారు. అందులోనూ మహేష్‌బాబు ఇప్పటికే ఇలాంటి కథలు వరుసగా చేస్తూ వచ్చాడు. ‘శ్రీమంతుడు’, ‘మహర్షి’.. ఇలా సినిమా నేపథ్యం ఏదైనా కథ అలాంటిదే. అంతా ఓకే బుక్‌మై షోలో ఏం రాశాడు అనేగా మీ ప్రశ్న.
అజయ్ అలియాస్ మహేష్‌బాబు సిటీలో లోన్ రికవరీ ఏజెంట్‌గా పని చేస్తుంటాడట. ఆ సమయంలో ఊళ్లో ఏదో పెద్ద సమస్య రావడంతో, తన దారిని మార్చుకుని ఊరికి వెళ్తాడట. మరి అక్కడికెళ్లి ఆ సమస్యను ఎలా తీర్చాడు అనేదే కథ. అన్నట్లు ఈ సినిమాకు బుక్‌మై షోలో ఇప్పటివరకు సుమారు లక్షా 75 వేల మంది ఇంట్రెస్ట్ బటన్ క్లిక్ చేశారట. అయితే ఈ ప్లాట్ గురించి తెలిసన ఫ్యాన్స్… పాత కథేనా అంటూ మీమ్స్ చేస్తున్నారు. ఇలా అయితే లెదర్ బెల్ట్‌లు కొనాల్సిందే అంటూ మీమ్‌లు పెడుతున్నారు.