పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నటించే అవకాశం కోసం ఎంతోమంది హీరోయిన్లు వెయిట్ చేస్తుంటారు. అయితే, ఆ ఛాన్స్ అందినట్టే అంది చేజారిపోతే ఎంత బాధగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హీరోయిన్ మాళవిక మోహనన్(Malavika Mohanan) విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. ప్రస్తుతం ప్రభాస్ సరసన ‘ది రాజా సాబ్’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమవుతున్న ఈ బ్యూటీ.. గతంలో మిస్ అయిన ఓ క్రేజీ ప్రాజెక్ట్ గురించి బయటపెట్టింది.
వాస్తవానికి మాళవిక మోహనన్ ప్రభాస్ బ్లాక్ బస్టర్ మూవీ ‘సలార్’లోనే హీరోయిన్‌గా నటించాల్సిందట. ‘మాస్టర్’ సినిమా రిలీజ్ అయిన కొన్ని నెలలకే దర్శకుడు ప్రశాంత్ నీల్ నుంచి ఆమెకు పిలుపు వచ్చిందట. ప్రభాస్ సినిమాలో ఛాన్స్ అని చెప్పగానే వెంటనే బెంగళూరు వెళ్లి లుక్ టెస్ట్ కూడా చేయించుకుందట. అక్కడ ప్రశాంత్ నీల్ స్వయంగా ఆమెను ఇండియన్, వెస్ట్రన్ అవుట్‌ఫిట్స్‌లో ఫోటోలు తీసి చూశారని, అన్నీ అనుకున్నట్లుగానే జరిగినా చివరి నిమిషంలో ఆ ప్రాజెక్ట్ వర్కవుట్ అవ్వలేదని మాళవిక తెలిపింది.

ప్రభాస్ లాంటి స్టార్ హీరో సినిమా మిస్ అవ్వడంతో అప్పట్లో చాలా డిజప్పాయింట్ అయ్యానని మాళవిక చెప్పుకొచ్చింది. అయితే, కొన్ని నెలలకే మళ్లీ ప్రభాస్ సినిమా ఆఫర్ రావడంతో షాక్ అయ్యానని తెలిపింది. మొదట అది పాత సినిమానే అనుకున్నా.. అది మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది రాజా సాబ్’ అని తెలిశాక చాలా హ్యాపీగా ఫీలయ్యానని పేర్కొంది.
సలార్ మిస్ అయినా.. తన తెలుగు డెబ్యూ ప్రభాస్ సినిమాతోనే జరగడం అంతా ‘డెస్టినీ’ అని ఆనందం వ్యక్తం చేసింది.ఇక ‘ది రాజా సాబ్’లో తన పాత్ర పేరు భైరవి అని, ఇందులో తన క్యారెక్టర్ చాలా వైబ్రెంట్‌గా ఉంటుందని మాళవిక వెల్లడించింది. ఫన్నీ సీన్స్, యాక్షన్, సాంగ్స్.. ఇలా ఒకే సినిమాలో తనలోని అన్ని కోణాలను చూపించే అవకాశం దక్కిందని తెలిపింది. 2026, జనవరి 9న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
