మంచు మోహన్‌బాబు (Mohan Babu) కుటుంబంలో వివాదం చల్లారుతున్నట్లు చల్లారి తిరిగి మళ్లీ రాజుకుంటోంది. ఒకవైపు నుంచి మా ఇంటి గొడవ అని మోహన్‌బాబు చెబుతుంటే.. మరోవైపు ఇద్దర తనయులు తమ రీతిలో ఇష్యూను పెద్దది చేస్తున్నారు. రోజూ ఏదో రీతిలో కంప్లైంట్‌లు, క్లారిటీ ఇస్తూ పోతున్నారు. తాజాగా మంచు మనోజ్ (Manchu Manoj) తన అన్న విష్ణు (Manchu Vishnu) మీద పహడీషరీఫ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఏడు పేజీలతో కూడిన ఫిర్యాదులో వివిధ అంశాలను ప్రస్తావించారు.
తన అన్న మంచు విష్ణు నుండి ప్రాణహాని ఉందని మంచు మనోజ్ మరోసారి పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇటీవల మనోజ్ – విష్ణు మధ్య తల్లి నిర్మల పుట్టిన రోజు సందర్భంలో వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. ఆ రోజు మంచు విష్ణు తనను చంపడానికి వచ్చాడంటూ పోలీసులకు మనోజ్ ఫిర్యాదు చేశాడు. అయితే మనోజ్ ఫిర్యాదులోని విషయాల్ని, ఆరోపణలను నిర్మల కొట్టి పారేశారు.
తమ ఇంటికి కరెంట్ లేకుండా చేసి, విష్ణు ఏదో చేయడానికి ప్రయత్నించినట్టు మనోజ్ ఆ రోజు కంప్లయింట్‌లో రాసుకొచ్చారు. జనరేటర్‌లో డీజిల్ ట్యాంకులో పంచదార పోసి ఇంట్లో భయానక పరిస్థితులు నెలకొనేలా చేశాడు అని కూడా పేర్కొన్నారు. అయితే మనోజ్ తన ఫిర్యాదులో చెప్పినట్లు విష్ణు ఎప్పుడూ ప్రవర్తించలేదని నిర్మల పోలీసులకు లేఖ కూడా రాశారు. దాంతోపాటు ఆ ఇంటి విషయంలో విష్ణు, మనోజ్‌కు సమాన హక్కులున్నాయని నిర్మల తెలిపారు.
మనోజ్ ఫిర్యాదు చూస్తే.. సెప్టెంబరు 11న ఈ వివాదం మొదలైనట్లు తెలుస్తోంది. మోహన్‌బాబు యూనివర్సిటీకి సంబంధించిన విషయంలో తాను ప్రశ్నించినప్పటి నుండి ఈ సమస్యలు వస్తున్నాయని ఆయన రాసుకొచ్చారు. డిసెంబరు 8న తొలి దాడి జరిగిందని, ఇప్పటివరకు ఏడుసార్లు ఈ విషయంలో తనను ఇబ్బందిపెట్టారని కూడా రాశారాయన. అలాగే గతేడాది మార్చి 24న, ఈ ఏడాది మార్చి 19న జరిగిన ఘటనల ఆధారాలను కూడా ఫిర్యాదుతోపాటు పోలీసులకు అందజేశారు. మరి ఈ విషయంలో విష్ణు ఎలా రియాక్ట్ అవుతారో, ఏం చేస్తారో చూడాలి.